
రూ. 4,000 కోట్ల ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీవో 30న
రేసులో ఎన్‌ఎస్‌డీఎల్, ఆదిత్య ఇన్ఫోటెక్, శ్రీ లోటస్ డెవలపర్స్
మొత్తం రూ.6,200 కోట్ల సమీకరణ
ఓవైపు సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు సందడి చేస్తున్నాయి. వెరసి ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య ఐపీవోల ద్వారా అన్‌లిస్టెడ్ కంపెనీలు రూ. 45,350 కోట్లు సమీకరించాయి. ఇది 45 శాతం వృద్ధికాగా.. మరో 118 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ బాటలో వచ్చే వారం 3 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. తద్వారా రూ. 6,200 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభంకానుంది. ఆగస్ట్ 1న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల శ్రేణి ప్రకటించవలసి ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా 5.01 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.
వీటిని సంస్థలో ప్రధాన వాటాదారులైన స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈతోపాటు.. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూటీ(ఎస్‌యూయూటీఐ) విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో నిధులు ప్రస్తుత వాటాదారుల సంస్థలకు చేరనున్నాయి. 2017లోనే ఐపీవోకు వచ్చిన సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్‌ఎల్) ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా డిపాజిటరీ సరీ్వసులందించే రెండో సంస్థగా ఎన్‌ఎస్‌డీఎల్ లిస్ట్‌కానుంది. 1996 నవంబర్‌లో డీమెటీరియలైజేషన్‌కు తెరతీయడంతో కంపెనీ డీమ్యాట్ సేవలలో భారీగా విస్తరించిన విషయం విదితమే. 2024–25లో కంపెనీ ఆదాయం 12% పైగా ఎగసి రూ. 1,535 కోట్లను తాకింది. నికర లాభం 25% జంప్‌చేసి రూ. 343 కోట్లకు చేరింది.