'నిర్ణయ్‌' క్షిపణి ప్రయోగం విజయవంతం

Nirbhay Cruise Missile Successfully Test-Fired From Odisha - Sakshi

వేయి కి.మీ.ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సత్తా క్షిపణి సొంతం

న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ రూపొందించిన బూస్టర్‌ ఇంజిన్ అమర్చిన 'నిర్భయ్‌' క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) బుధవారం ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కిమీల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేధించగలదు. బుధవారం ఉదయం పదింటికి క్షిపణిని ప్రయోగించగా 15 నిమిషాలపాటు గాల్లో దూసుకెళ్లి 100 కి.మీ.ల దూరంలోని నిర్దేశత లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని డీఆర్‌డీవో పేర్కొంది. '

'నిర్భయ్‌' ప్రాజెక్టు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒక దశలో ఏకంగా ఈ ప్రాజెక్టునే పక్కనపెట్టేయాలని రక్షణ శాఖ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల లేమి, పలు సాంకేతిక సమస్యలు ఇందుకు కారణాలయ్యాయి.. ఇటీవల గత ఏడాది అక్టోబర్‌లో సైతం క్షిపణిని ప్రయోగించాక ఎనిమిది నిమిషాల తర్వాత పరీక్షను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇన్ని అడ్డంకుల్ని తట్టుకుని తాజా పరీక్షలో 'నిర్భయ్‌' తన సత్తా చాటింది. పరీక్ష విజయవంతమవడంతో వీలైనంత త్వరగా సైన్యానికి అందించేలా దీన్ని సంసిద్ధం చేయాలని డీఆర్‌డీవో భావిస్తోంది.

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్‌లో సైన్యంలోకి తీసుకున్నాక చైనా సరిహద్దుల్లో దీన్ని మోహరించే వ్రతిపాదనలూ ఉన్నాయి. భూతల లక్ష్యాలను చేధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రయోగించే. క్రూయిజ్‌ క్షిపణి రకానికి చెందిన “నిర్భయ్‌” ఏకంగా 800 కేజీల పేలుడు పదార్దాలను మోసుకుపోగలదు. దాదాపు 0.7 మ్యాక్‌ స్పీడ్‌తో ఇది ప్రయాణిస్తుంది. అరు మీటర్ల పోడవు, 0.52 మీటర్‌ వెడల్పుండే ఈ క్షిపణిని గగనతల, సముద్ర, భూతలాల నుంచి ప్రయోగించవచ్చు. తొలి దశలో ఘన ఇంధనాన్ని తర్వాత ద్రవ ఇంధనాన్ని వాడుకునే మిస్సైల్‌ ఇది. జలాంతర్భాగంలో ప్రయాణించడంతోపాటు, అత్యంత తక్కువ ఎత్తుల్లో ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో దీని జాడను శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top