మార్కెట్లు: రికార్డులే రికార్డులు

Market hits new highs- Sensex crossed 44,000 mark - Sakshi

315 పాయింట్లు అప్‌- 43,953 వద్ద నిలిచిన సెన్సెక్స్‌

94 పాయింట్లు జంప్‌చేసి 12,874 వద్ద ముగిసిన నిఫ్టీ

ఇంట్రాడేలో తొలిసారి 44,000 పాయింట్లను దాటిన సెన్సెక్స్‌

13,000 పాయింట్ల సమీపానికి చేరిన నిఫ్టీ

మెటల్‌, బ్యాంకింగ్‌, రియల్టీ జోరు- మీడియా, ఫార్మా వీక్‌

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లలో దీపావళి సందడి కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ఇండెక్సులు నిరవధికంగా పరుగు తీస్తున్నాయి. వెరసి రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్‌ 315 పాయింట్లు ఎగసి 43,953 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 94 పాయింట్లు పుంజుకుని 12,874 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో తొలిసారి సెన్సెక్స్‌ 44,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ సైతం 13,000 పాయింట్ల మార్క్‌ సమీపానికి అంటే 12,934కు చేరింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ ఆశలు రేపగా.. తాజాగా మోడర్నా ఇంక్‌ సైతం వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఆటో సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, బ్యాంకింగ్‌, రియల్టీ రంగాలు 2.5-2 శాతం లాభపడగా.. ఆటో 1 శాతం బలపడింది. మీడియా, ఫార్మా, ఐటీ 1.3-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, బజాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీ 6.2- 2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బీపీసీఎల్‌, హీరో మోటో, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌ 4.3-0.6 శాతం మధ్య క్షీణించాయి. చదవండి: (వ్యాక్సిన్‌ ఆశలు‌- యూఎస్‌ కొత్త రికార్డ్స్‌)

చిన్న షేర్లు అప్
డెరివేటివ్‌ కౌంటర్లలో అదానీ ఎంటర్‌, జిందాల్‌ స్టీల్‌, అపోలో టైర్, నాల్కో, ఐసీఐసీఐ ప్రు, ఎంఆర్‌ఎఫ్‌, పేజ్‌, అంబుజా, టాటా పవర్‌ 6-3.4 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క పిరమల్‌, టొరంట్‌ ఫార్మా, సన్‌ టీవీ, ఐబీ హౌసింగ్‌, లుపిన్‌, బాష్‌, ముత్తూట్‌ 3.2- 1.8 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,564 లాభపడగా.. 1,254 నష్టపోయాయి. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్‌ మస్క్‌?)

అమ్మకాలవైపు
నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 78.5 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  డీఐఐలు రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. కాగా.. ఈ నెలలో 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం విశేషం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top