
లగ్జరీ సెగ్మెంట్లో 11 శాతానికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా
జనవరి–మే వ్యవధి గణాంకాలు
66 శాతం పెరిగిన మార్కెట్
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు కాలుష్యకారక ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే క్రమంగా పర్యావరణహితమైన వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనితో లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా పెరుగుతోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం 2024 జనవరి–మే మధ్య కాలంలో లగ్జరీ సెగ్మెంట్లో 7 శాతంగా ఉన్న ఈవీల వాటా ఈ ఏడాది అదే వ్యవధిలో 11 శాతానికి చేరింది. ఏకంగా 66 శాతం వృద్ధి చెందింది. ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2025లో జూన్ నెలాఖరు వరకు అమ్ముడైన ఖరీదైన కార్లలో 10 శాతం వాటా ఈవీలదే ఉంటోంది. గతేడాది ఇదే వ్యవధిలో వీటి వాటా 5 శాతం లోపే నమోదైంది.
కొత్త మోడల్స్ దన్ను..
మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతుండటం కూడా ప్రీమియం కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి నెలకొనడానికి కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 మోడల్ గేమ్‌చేంజర్‌గా నిల్చిందని పేర్కొన్నాయి. ఇక, తమిళనాడులోని రాణిపేటలో 2026 తొలి నాళ్లలో భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవల ప్రకటించింది. ప్రాథమికంగా దీని వార్షికోత్పత్తి సామర్థ్యం 30,000 యూనిట్లుగా ఉంటుంది. ఇక అమెరికన్ దిగ్గజం టెస్లా కూడా భారత్‌లో విక్రయాలకు సిద్ధమవుతోంది.
జూన్ 15న తొలి స్టోర్‌ను ముంబైలో ప్రారంభిస్తోంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈవీలను ఎందుకు కొనాలి అనే సందేహం నుంచి బైటపడి ఏ ఈవీని కొనుక్కోవాలి అనే ఆలోచించే వైపు కొనుగోలుదార్లు మళ్లుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. తాను రెండేళ్లుగా ఈవీని ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు.
మాస్ మార్కెట్ ఈవీల రేట్లు కూడా దాదాపు సంప్రదాయ ఐసీఈ వాహనాల ధరలకు కాస్త అటూ ఇటూగా ఉండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కి దోహదపడుతోంది. ట్యాక్సేషన్‌పరమైన ప్రయోజనాల వల్ల లగ్జరీ సెగ్మెంట్లో ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీల రేట్లు కొన్ని సందర్భాల్లో 4–5 శాతం తక్కువకే లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక , డ్రైవింగ్‌పరంగా సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు పెరుగుతుండటం వంటి అంశాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తికి దోహదపడుతున్నాయని వివరించాయి. రేంజ్‌పరమైన (మైలేజీ) ఆందోళన కూడా తగ్గుతోందని పేర్కొన్నాయి.
టాప్ ఎండ్ లగ్జరీ కార్లకు డిమాండ్
దేశీయంగా టాప్ ఎండ్ లగ్జరీ, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయంగా డిమాండ్ నెలకొందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలపరంగా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసినట్లు చెప్పారు. 4,238 కార్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఎస్–క్లాస్, మేబాక్, ఏఎంజీల్లాంటి టాప్ ఎండ్ వాహన విక్రయాలు 20 శాతం ఎగిశాయని వివరించారు. కొత్తగా జీఎల్‌ఎస్ ఏఎంజీ లైన్‌కి సంబంధించి రెండు వాహనాలను కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 1.4 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది.