రిలయన్స్‌ రిటైల్‌లో కేకేఆర్‌ ఎంట్రీ

KKR to invest Rs 5,550 crore in Reliance Retail Ventures - Sakshi

డీల్‌ విలువ రూ.5,550 కోట్లు

1.28 శాతం వాటా కొనుగోలు 

మార్కెట్‌ విలువ రూ.4.21 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌ను ప్రమోట్‌ చేస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో 1.28 శాతం వాటాను ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.5,550 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ విలువ రూ.4.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసియా ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌ ద్వారా కేకేఆర్‌ రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థగా ఉంది. రిలయన్స్‌ రిటైల్‌ రెండు వారాల వ్యవధిలో రెండో డీల్‌ను కుదుర్చుకోవడం ఆసక్తికరం.

అంతక్రితం సిల్వర్‌ లేక్‌ రూ.7,500 కోట్లతో 1.75 శాతం వాటా కొనుగోలుకు డీల్‌ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఇటీవలే రిలయన్స్‌జియో ప్లాట్‌ఫామ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేశాయి. జియో ప్లాట్‌ఫామ్‌లో 2.32 శాతం వాటా కోసం కేకేఆర్‌ రూ.11,357 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. అదే విధంగా సిల్వర్‌ లేక్‌ కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 శాతం వాటాను సొంతం చేసుకుంది. నియంత్రణ సంస్థల ఆమోదంపై తాజా డీల్‌ ఆధారపడి ఉంటుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. ఈ డీల్‌ విషయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు మోర్గాన్‌ స్టాన్లీ.. కేకేఆర్‌కు డెలాయిట్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా వ్యవహరించాయి.

రిలయన్స్‌ మార్జిన్లు పెరుగుతాయ్‌..
జియో ప్లాట్‌ఫామ్‌లలో ఫేస్‌బుక్, గూగుల్‌ సహా 13 సంస్థలు కలసి రూ.1.52 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. రిలయన్స్‌ రిటైల్‌లోనూ ముందుగా వీటికే వాటాను ఇవ్వజూపుతున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. దీన్ని నిజం చేసే విధంగా సిల్వర్‌ లేక్, కేకేఆర్‌ రిలయన్స్‌ రిటైల్‌లోనూ వాటాలు దక్కించుకున్నాయి. ఇతర ఇన్వెస్టర్లలో ఎవరు రిలయన్స్‌ రిటైల్‌ వాటాకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇటీవలే ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్‌ ఆస్తుల కొనుగోలుకు రిలయన్స్‌ డీల్‌ కుదుర్చుకుంది. ఇందు కోసం రూ.24వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డీల్‌ తర్వాతే నిధుల సమీకరణకు రిలయన్స్‌ రిటైల్‌ ద్వారాలు తెరిచింది. తద్వారా అమెజాన్, వాల్‌మార్ట్‌లకు గట్టిపోటీనిచ్చే ప్రణాళికలతో ఉంది. రిలయన్స్‌ రిటైల్‌ కింద గ్రోసరీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, జియోమార్ట్‌ తదితర వ్యాపారాలున్నాయి. దేశవ్యాప్తంగా 12వేలకు పైగా స్టోర్లను నిర్వహిస్తూ అతిపెద్ద రిటైల్‌ సంస్థగా ఉంది. టెలికం, రిటైల్, గ్లోబల్‌ రిఫైనరీలో స్థిరీకరణ వేగవంతం కావడంతో కరోనా తర్వాత ఆర్‌ఐఎల్‌ బలంగా అవతరిస్తుందని, ధరల పరంగా ఉన్న శక్తి కారణంగా మార్జిన్లు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది.  

షేరు.. జోరు... : కేకేఆర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వార్త రిలయన్స్‌కు జోష్‌నిచ్చింది. మార్కెట్లు నష్టాల్లోనే ముగిసినప్పటికీ.. రిలయన్స్‌ షేరు మాత్రం 1 శాతం లాభపడి బీఎస్‌ఈలో రూ.2,230 వద్ద క్లోజయింది.

కేకేఆర్‌కు మంచి ట్రాక్‌ రికార్డు..
పరిశ్రమల్లో ప్రముఖ ఫ్రాంచైజీలకు విలువను తీసుకొచ్చి పెట్టే భాగస్వామిగా కేకేఆర్‌కు చక్కని ట్రాక్‌ రికార్డు ఉంది. పైగా ఎన్నో సంవత్సరాలుగా భారత్‌ మార్కెట్‌ పట్ల అంకిత భావంతో పనిచేస్తోంది. కేకేఆర్‌ గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌తో కలసి పనిచేయాలనుకుంటున్నాము.
– ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత

రిలయన్స్‌తో జట్టు సంతోషకరం
ఆర్‌ఆర్‌వీఎల్‌ వర్తకులను సాధికారులుగా మారుస్తోంది.   రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ (జియోమార్ట్‌) వినియోగదారులకు, చిన్న వ్యాపారాలకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మరింత మంది భారతీయ వినియోగదారులు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు మారుతున్నారు. భారత్‌లో ముఖ్యమైన ఓమ్నిచానల్‌ రిటైలర్‌గా ఎదగాలన్న రిలయన్స్‌ రిటైల్‌ కార్యక్రమానికి మద్దతు తెలపడం ఆనందాన్నిస్తోంది.
– హెన్నీ క్రావిస్, కేకేఆర్‌ సహ వ్యవస్థాపకుడు
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top