Kia EV6 India Launch: కియా ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది, సింగిల్‌ ఛార్జ్‌తో 520 కి. మీ దూసుకెళ్తుంది!

Kia Ev6 Electric Launched In India - Sakshi

న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా దేశీ ఎలక్ట్రిక్‌ కార్ల (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. ఈవీ6 కారును ఆవిష్కరించింది. రెండు వేరియంట్స్‌లో ఇది లభిస్తుంది. ధర శ్రేణి రూ. 59.95 లక్షలు – రూ. 64.95 లక్షలుగా (ఎక్స్‌ షోరూం) ఉంటుంది. 12 నగరాల్లోని 15 డీలర్‌షిప్‌ల ద్వారా దీన్ని విక్రయించనున్నారు. డీలర్‌షిప్‌లలో 150 కిలోవాట్ల ఫాస్ట్‌ చార్జర్లు కూడా ఉంటాయి. ఈవీ6 మోడల్‌ కోసం ఇప్పటికే 355 పైచిలుకు బుకింగ్స్‌ వచ్చినట్లు కియా ఇండియా ఎండీ టే–జిన్‌ పార్క్‌ తెలిపారు.

ఒకసారి చార్జి చేస్తే ఈ వాహనం 528 కి.మీ. వరకూ ప్రయాణించగలదు. 350 కేడబ్ల్యూహెచ్‌ (కిలోవాట్‌ పర్‌ అవర్‌) చార్జర్‌తో 18 నిమిషాల్లోనే 10 శాతం నుండి 80 శాతం మేర చార్జ్‌ కాగలదని పార్క్‌ వివరించారు. వేరియంట్‌ను బట్టి ఆల్‌–వీల్‌ డ్రైవ్, సన్‌రూఫ్, మల్టిపుల్‌ డ్రైవ్‌ మోడ్‌లు మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.  

ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు టే–జిన్‌ పార్క్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వ్యాపార కార్యకలాపాలపై 22.22 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ మాతృసంస్థ కియా కార్పొరేషన్‌ ఇప్పటికే ప్రకటించింది. భారత్‌లో ఇన్‌ఫ్రా ఏర్పాటుకు, స్థానికంగా అనువైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఇందులో కొంత భాగాన్ని వినియోగించనున్నట్లు పార్క్‌ తెలిపారు. ప్రత్యేకంగా భారత మార్కెట్‌ కోసమే తయారు చేసిన బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని (బీఈవీ) 2025 నాటికి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

చార్జింగ్‌ ఇన్‌ఫ్రా కీలకం.. 
ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని పార్క్‌ పేర్కొన్నారు. అయితే, దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు మరింత ప్రాచుర్యంలోకి రావాలంటే చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, వ్యక్తిగత వాహనాలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలు తోడ్పడగలవని అభిప్రాయపడ్డారు. స్థానికంగా బ్యాటరీ సెల్‌ తయారీ ప్రారంభమైతే ఈవీలకు మరింత ఊతం లభించగలదన్నారు. సానుకూల ప్రభుత్వ విధానాలు, వినియోగదారుల ఆలోచనా ధోరణుల్లో మార్పులు తదితర అంశాల తోడ్పాటుతో 2025 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం భారీగా పెరగవచ్చని పార్క్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top