ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్! | iPhone 18 Pro Max Price Launch Details Leaked Ahead of Official Announcement | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్!

Jun 2 2026 6:50 PM | Updated on Jun 2 2026 7:14 PM

iPhone 18 Pro Max Price Launch Details Leaked Ahead of Official Announcement

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటైన యాపిల్ తన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతకంటే ముందు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీకయ్యాయి.

సప్లై చైన్ వర్గాలు, సాంకేతిక విశ్లేషకుల సమాచారం ప్రకారం.. యాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లో బ్యాటరీ, కెమెరా వంటి వాటిలో మాత్రమే కాకుండా ఏఐ(AI) వంటి వాటిలో కూడా భారీ మెరుగుదలలు ఉండనున్నాయి. అయితే.. రాబోయే ఐఫోన్ గురించి యాపిల్ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర గత మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరకు సమానంగా ఉండే అవకాశం ఉంది. కొత్త 2-నానోమీటర్ ప్రాసెసర్, అధిక ర్యామ్ వంటి ఆధునిక భాగాల వలన తయారీ ఖర్చులు పెరిగినా, వాటిలో కొంత భారాన్ని ఆపిల్ స్వయంగా భరించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం కెమెరా సిస్టం. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుందని సమాచారం. దీని ద్వారా వినియోగదారులు కెమెరాలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించగలరు. ఫలితంగా ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్ మీద మరింత నియంత్రణ లభిస్తుంది.

యాపిల్ కొత్త మూడు లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్ మీద పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సెన్సార్ ఫోటోలలో వచ్చే నాయిస్‌ను తగ్గించి మరింత స్పష్టమైన చిత్రాలను అందించగలదు. అల్ట్రా-వైడ్, టెలిఫోటో కెమెరాలు కూడా 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉండే అవకాశముంది. ముఖ్యంగా టెలిఫోటో కెమెరా తక్కువ వెలుతురు పరిస్థితుల్లో మెరుగైన ఫోటోలను అందించేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 5100mAh నుంచి 5200mAh వరకు సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది గత మోడల్‌లోని సుమారు 4823mAh బ్యాటరీ కంటే గణనీయమైన పెరుగుదల. దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీని అమర్చేందుకు ఫోన్ మందం 8.8 మిల్లీమీటర్ల వరకు పెరగవచ్చని, బరువు సుమారు 240 గ్రాముల వరకు ఉండవచ్చని అంచనా. అయినప్పటికీ, ఎక్కువ బ్యాటరీ జీవితం కోసం వినియోగదారులు ఈ మార్పును స్వాగతించే అవకాశం ఉంది.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉండవచ్చు. అలాగే.. ప్రస్తుతం ఉన్న డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని మరింత చిన్నదిగా చేసే ప్రయత్నంలో యాపిల్ ఉన్నట్లు సమాచారం. కొత్త చిప్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ద్వారా ఫోన్‌లో అదనపు స్థలాన్ని సృష్టించి, అంతర్గత భాగాల సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది. ఇది సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement