ట్విట్టర్‌ కూతా... మనోడిదే!

Indian-origin Parag Agrawal takes over as new Twitter CEO - Sakshi

సీఈవోగా భారతీయ అమెరికన్‌ పరాగ్‌ అగర్వాల్‌

రాజీనామా చేసిన వ్యవస్థాపకుడు జాక్‌డార్సే

శాన్‌ఫ్రాన్సిస్కో:  టెక్నాలజీ ప్రపంచంపై మరో భారతీయ అమెరికన్‌ తనదైన ముద్ర వేయనున్నారు. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్విట్టర్‌’ సీఈవోగా భారతీయ అమెరికన్‌ పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌డార్సే సోమవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీతోపాటు.. డార్సే సైతం ట్విట్టర్‌లో ప్రకటించారు. పరాగ్‌ అగర్వాల్‌ ఇప్పటి వరకు ట్విట్టర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీవో)గా పనిచేశారు. ఫైనాన్షియల్‌ పేమెంట్స్‌ కంపెనీ ‘స్క్వేర్‌’కు సైతం డార్సే చీఫ్‌గా ఉన్నారు. దీంతో సంస్థలో వాటాలు కలిగిన పెద్ద ఇన్వెస్టర్లు.. డార్సే రెండు బాధ్యతలను సమర్థవంతంగా నడిపించగలరా? అన్న సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.  

వెళ్లిపోయే సమయం వచ్చింది
‘‘కంపెనీ వ్యవస్థాపకుడి నుంచి సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ వరకు 16 ఏళ్లలో ఎన్నో బాధ్యతల్లో పనిచేశాను. కంపెనీని వీడే సమయం వచ్చిందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎందుకని? వ్యవస్థాపకుల నేతృత్వంలోని సంస్థ ప్రాముఖ్యం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అంతిమంగా ఇది ఎన్నో పరిమితులకు దారితీస్తుందని, వైఫల్యానికి ఏకైక అంశంగా మారుతుందని భావిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్‌ పేజీలోని తన పోస్ట్‌లో డార్సే వివరించారు.

ఏకాభిప్రాయంతో ఎంపిక: ‘‘బోర్డు విస్తృత ప్రక్రియ, అన్ని ఆప్షన్లను పరిశీలించి ఏకాభిప్రాయంతో పరాగ్‌ను సీఈవోగా నియమించింది. కంపెనీని ఎంతో లోతుగా అర్థం చేసు కున్న పరాగ్‌ ముందు నుంచి నా ఎంపికే. సంస్థలో ప్రతీ కీలక నిర్ణయం వెనుక ఆయన ఉన్నా రు. పరాగ్‌ ఎంతో ఆసక్తి, పరిశీలన, సృజనాత్మకత, స్వీయ అవగాహన, వినయం కలిగిన వ్యక్తి. మనస్ఫూర్తిగా సంస్థను నడిపిస్తారు. నేను నిత్యం ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. సీఈవోగా ఆయన పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది’’అని డార్సే అన్నారు. 2022 లో డార్సే పదవీకాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్‌ బోర్డులో కొనసాగుతారని కంపెనీ తెలిపింది.

11 ఏళ్లలోనే కీలక స్థానానికి..  
పరాగ్‌ అగర్వాల్‌ ఐఐటీ బోంబేలో బీటెక్‌ విద్య పూర్తయిన తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. పదేళ్ల క్రితం 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరారు. ఆ సమయంలో సంస్థ ఉద్యోగులు 1,000 మందే ఉండడం గమనార్హం. 2018లో సీటీవో అయ్యారు. సీఈవోగా ఎంపిక కావడం తనకు గర్వకారణమని పరాగ్‌ ప్రకటించారు. ‘‘మీ (జాక్‌డార్సే) మార్గదర్శకత్వం, స్నేహానికి జోహార్లు. మీరు నిర్మించిన పని విధానం, సంస్కృతికి ధన్యుడను. సంస్థను కీలకమైన సవాళ్ల మధ్య నడిపించారు. దశాబ్దం క్రితం.. ఆ రోజులను నిన్నటిగానే భావిస్తాను. మీ అడుగుల్లో నడిచాను. ఉద్దాన, పతనాలు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను స్వయంగా చూశాను. వీటన్నింటినీ మించి గొప్ప విజయాలను చూస్తున్నాను. గొప్ప అవకాశాలు మా ముందున్నాయి’’అని అగర్వాల్‌ ప్రకటించారు.

భారతీయుల ముద్ర
భారతీయుల అపార ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను జన్మతః భారతీయులైన వారు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ జాబితాలోకి పరాగ్‌ అగర్వాల్‌ కూడా చేరిపోయారు. గూగుల్‌ (ఆల్ఫాబెట్‌) సీఈవోగా సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం  సీఈవో అరవింద్‌ కృష్ణ,  అడోబ్‌ సీఈవో శంతను నారాయణన్, మాస్టర్‌కార్డ్‌ సీఈవోగా అజయ్‌పాల్‌ సింగ్‌ బంగా తదితరులు తమ సత్తా చాటుతుండడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top