
బెంగళూరు: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రముఖ మార్కెట్‌గా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్ల)కు పైగా చేరుకోవచ్చు. పునరుత్పాదక ఇంధనం, ఛార్జింగ్ స్టేషన్లు & దాని సరఫరా గొలుసును బలోపేతం చేయడం వల్ల ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ఒక కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్లు ఈ రంగంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు, నిపుణులు తెలిపారు. భారతదేశంలో ఈవీ తయారీదారుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది.
ఈవీ మొబిలిటీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇండియా ఎనర్జీ స్టోరేజీ అలయన్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఈవీ మార్కెట్ 2026 వరకు 36 శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఈవీ బ్యాటరీ మార్కెట్ ఇదే కాలంలో 30 శాతం వరకు విస్తరిస్తుంది. బెంగళూరు టెక్ సమ్మిట్ (బిటిఎస్ 2021)లో మెహర్ ఎనర్జీ వెంచర్స్ సీఈఓ ముస్తఫా వాజిద్ మాట్లాడుతూ.. "సరఫరా గొలుసు వ్యవస్థను ఇంకా అభివృద్ధి పరచాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశం అతిపెద్ద మార్కెట్, ప్రపంచవ్యాప్తంగా తేలికపాటి వాహన పరిశ్రమకు కేంద్రంగా కూడా ఉంటుంది. మనకు ఇందులో బిలియన్ డాలర్ల అవకాశం ఉంది" అని అన్నారు.
(చదవండి: Multibagger: రూ.లక్షతో రూ.6.5కోట్లు లాభం.. కళ్లుచెదిరే రాబడి!)
దేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 100 జీడబ్ల్యుగా ఉందని, దీనిని 2030 నాటికి 400 జీడబ్ల్యుకి పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే రెండేళ్లలో ఐపీఓ కోసం ప్లాన్ చేస్తున్న అథర్ ఎనర్జీ 20ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఓఈఎంలు(ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్) సప్లై ఛైయిన్ సామర్ధ్యం చాలా బలంగా ఉందని, అయితే దురదృష్టవశాత్తు సప్లై ఛైయిన్ లో చాలా వరకు వెనుకబడి ఉన్నట్లు అథర్ ఎనర్జీ కో ఫౌండర్, సీఈఓ తరుణ్ మెహతా తెలిపారు. "చైనాతో పోలిస్తే భారతదేశంలో కొత్త డిజైన్ ప్రవేశపెట్టడానికి సగటున 5-6 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది" అని ఆయన అన్నారు.