చక్కెర ఎగుమతులపై తాలిబన్‌ ఎఫెక్ట్‌ ?

India Sugar Traders Are Hoping Situation In Afghanistan Will Resume Soon - Sakshi

ఇరవై ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉ‍న్న అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల రాకతో మరోసారి అలజడి రేగింది. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను కొత్తగా అధికార పీఠం కైవసం చేసుకున్న తాలిబన్లు గౌరవిస్తారా ? లేదా ? అసలు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై వ్యాపార వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతి దారులు అఫ్గన్‌లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు.

మంచి సంబంధాలు
ఆఫ్ఘనిస్తాన్‌ , ఇండియాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో నిరంకుశ తాలిబన్లు ఉన్నా, అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వం ఉ‍న్నా ఎగుమతులు, దిగుమతులు బాగానే జరిగాయి. ముఖ్యంగా అఫ్గన్‌ నుంచి ఇండియాకు డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువగా దిగుమతి అవుతుండగా ఇండియా నుంచి అఫ్గన్‌కి చక్కెర, తృణధాన్యాలు, టీ, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, వస్త్రాలు ఎగుమతి అ​య్యేవి. 

826 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు 
గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం అఫ్గన్‌ నుంచి ఇండియాకు జరిగిన దిగుమతుల విలువ 509 మిలియన్‌ డాలర్లు ఉండగా ఇండియా నుంచి జరిగిన ఎగుమతుల విలువ 826 మిలియన్‌ డాలర్లుగా నమోదు అయ్యింది. ఎగుమతులు వన్‌ బిలియన్‌కి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా అఫ్గన్‌లో సంక్షోభం తలెత్తింది

ఇబ్బందులు తప్పవా ?
ఇండియా నుంచి అఫ్గన్‌కి జరుగుతున్న ఎగుమతుల్లో ప్రధానమైంది చక్కెర. అఫ్గన్‌లో ఇండియా చక్కెరను భారీగా ఉపయోగిస్తారు. ఇండియా నుంచి సముద్ర మార్గంలో కరాచీ పోర్టుకు చేరకున్న చక్కెర అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అఫ్గన్‌ చేరుకుంటుంది. గతేడాది 6.24 లక్షల టన్నుల చక్కెర అఫ్గనిస్తాన్‌కి ఎగుమతి అయ్యిందని ఆలిండియా సుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ తెలిపింది. ప్రస్తుత సంక్షోభంతో ఈ ఎగుమతి డోలాయమానంలో పడిందంటూ వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్‌ లాంటి పెద్ద మార్కెట్‌ను కోల్పోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. 

పరిస్థితులు చక్కబడతాయి
మరోవైపు తాలిబన్లు అత్యవసర వస్తువులపై ఎక్కువగా దిగుమతి సుంకం విధించని, గతంలో 1996 నుంచి 2001 వరకు వారితో వ్యాపారం సజావుగానే జరిగిందంటున్నాడు పాతకాలం వర్తకులు. అధికార పీఠం గురించి జరిగే వివాదాలు సద్దుమణిగితే పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: బంగారం రుణాల్లోకి షావోమీ !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top