దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లు అమలుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్లిష్టమైన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో సరళీకరించిన ఈ నూతన కోడ్లను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయాల్సి ఉంది.
స్వాతంత్య్రానికి పూర్వం నాటి పాత చట్టాలకు స్వస్తి పలికి మారుతున్న సాంకేతికత, పని వాతావరణానికి అనుగుణంగా ఈ సంస్కరణలను తీసుకువచ్చారు. గత ఏడాది నవంబర్ 21, 2025న కేంద్రం వీటిని అధికారికంగా ప్రకటించినప్పటికీ రాష్ట్రాల నిబంధనల రూపకల్పన ప్రక్రియలో ఉండటంతో అమలు తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా, కార్మిక శాఖ ఈ నిబంధనలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు సమాచారం.
ఏమిటి ఈ కొత్త కోడ్లు?
1. వేతనాల కోడ్, 2019: వేతనాల పంపిణీ, కనీస వేతనాల క్రమబద్ధీకరణ.
2. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020: యాజమాన్యం, కార్మికుల మధ్య సత్సంబంధాలు, వివాదాల పరిష్కారం.
3. సామాజిక భద్రత కోడ్, 2020: అసంఘటిత రంగ కార్మికులకు కూడా బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు.
4. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020: పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య ప్రమాణాలు.
జీతం లెక్కల్లో మార్పు..
కొత్త కోడ్ల ప్రకారం వేతనం నిర్వచనంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఒక ఉద్యోగి పొందే మొత్తం జీతంలో ప్రాథమిక వేతనం (బేసిక్ పే), కరువు భత్యం (డీఏ), రిటైనింగ్ అలవెన్స్ కలిపి కనీసం 50 శాతం ఉండాలి. ఒకవేళ ఇతర అలవెన్సులు 50 శాతం మించితే ఆ అదనపు మొత్తాన్ని కూడా వేతనంగానే పరిగణిస్తారు. బేసిక్ పే పెరగడం వల్ల భవిష్య నిధి (పీఎఫ్), గ్రాట్యుటీ విరాళాలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో కార్మికుడికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. అయితే ప్రతి నెలా చేతికి వచ్చే నికర జీతం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.
కీలక సంస్కరణలు - ముఖ్యాంశాలు
ఈ నూతన చట్టాలు అమలులోకి వస్తే లింగ భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన వేతనం అందుతుంది.
సామాజిక భద్రతను నిర్ధారించడానికి ప్రతి కార్మికుడికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వడం ఇకపై తప్పనిసరి.
కాంట్రాక్ట్ లేదా నిర్ణీత కాలానికి పనిచేసే వారికి కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు అందుతాయి.
ఫిర్యాదుల పరిష్కార కమిటీల్లో మహిళలకు తప్పనిసరిగా చోటు కల్పించాలి.
500 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థల్లో ప్రత్యేక సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి.
పెన్షన్ పథకంలో మార్పులు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) 1995 స్థానంలో కొత్త సవరించిన పథకం రానుంది. సామాజిక భద్రత కోడ్ కింద రూపొందించే ఈ కొత్త పెన్షన్ విధానం అమలులోకి వచ్చే వరకు పాత విధానమే కొనసాగుతుంది.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిబంధనలను ఖరారు చేసింది. ప్రస్తుతం ఇవి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అయితే కార్మిక అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని నిబంధనలను ఖరారు చేసి నోటిఫై చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముసాయిదా నిబంధనలను సిద్ధం చేశాయి.
ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు


