
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షణీయంగా మార్చిందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అధ్యయనం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు దీర్ఘకాలంలో భారత్‌కు ప్రయోజనం కలిగిస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రీసెర్చ్ అధ్యయన నివేదికను విడుదల చేసింది.
అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్య సవాళ్లకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలు మారుతున్నందున.. ఈ అవకాశాన్ని భారత్ సది్వనియోగం చేసుకుని తన తయారీ వృద్ధిని వేగవంతం చేసుకోగలదని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానం కాగలదని ఈ నివేదిక అంచనా వేసింది. స్థానికంగానే విడిభాగాల సమీకరణ, తుది మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఉండడం, ప్రాంతీయ అనుసంధానత పెంచుకోవడం ద్వారా భారత్ తయారీ రంగం మరిన్ని అదనపు పెట్టుబడులను ఆకర్షించొచ్చని సూచించింది.
భారత్ అత్యాధునిక టెక్నాలజీ సామర్థ్యాలను, తయారీ పోటీతత్వాన్ని పెంచుకోవడం ద్వారా తయారీలో అదనపు ఉపాధి అవకాశాలను కల్పించొచ్చని పేర్కొంది. సరఫరా వ్యవస్థ వైవిధ్యంలో భాగంగా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో భారత్‌కు ప్రయోజనం లభిస్తుందని వివరించింది. 2024–25లో భారత జీడీపీ వృద్ధి నిదానించినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు గుర్తు చేసింది.
భారత వృద్ధిలో ఎగుమతులపై ఆధారపడడం మోస్తరుగానే ఉన్నట్టు తెలిపింది. ఈ సానుకూలత వల్లే అంతర్జాతీయ వాణిజ్యం, టారిఫ్ విధానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న మార్పుల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని పేర్కొంది. భారత స్థూల జీడీపీలో తయారీ విలువ 17.2 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఇటీవలి తయారీ పీఎంఐ గణాంకాలు పటిష్టంగా ఉండడాన్ని ప్రస్తావించింది.