
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ‘బ్లూ ఎకానమీ’ కీలక పాత్ర పోషించనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీష్ చంద్ర (జీసీ) ముర్ము విశ్లేషించారు. సుస్థిర వృద్ధి, సామాజిక, ఆర్థిక సంక్షేమం వంటి అంశాల విసృత ప్రాతిపదికన ఎకానమీ పురోగతికి సంబంధించి మున్ముందు బ్లూ ఎకానమీ కీలకం కానుందని ఆయన అన్నారు. బ్లూ ఎకానమీ ఇస్తున్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
► భారత్ 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలను కలుపుతోంది. సముద్ర తీవ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 40 లక్షలకు పైగా మత్స్యకారులకు, ఇతర తీర ప్రాంత వర్గాలకు చక్కటి ఆర్థిక అవకాశాలను అందిస్తోంది.
► ఇక దాదాపు 199 ఓడరేవులు ఉన్నాయి, వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు దోహదపడుతూ, దేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.
► రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి క్రూడ్, సహజవాయువులుసహా విస్తారమైన వనరులను కలిగిఉంది.
► సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్‌డీజీ) సాధనకు బ్లూ ఎకానమీ కీలక భూమికను పోషించనుంది.
బ్లూ ఎకనమీ అంటే..
ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం క్లుప్తంగా బ్లూ ఎకానమీ అర్థాన్ని పరిశీలిస్తే... ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరుల ను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. ‘‘సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ’’ అని యూరోపియన్ కమిషన్ నిర్వచించింది. 2022–2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడంతో, ఈ సందర్భంగా బ్లూ ఎకానమీకి సంబంధించి జరుగుతున్న ఎస్‌ఏఐ20 సదస్సు బాధ్యతలను కాగ్ నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీపై అధ్యయనంపై ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను, విధానాలను ఎలా రూపొందించవచ్చు, అమలుచేయవచ్చు వంటి అంశాలపై ఎస్‌ఏఐ20 అధ్యయనం చేస్తుంది.