ఏప్రిల్‌లో సానుకూలంగా ఎగుమతులు | India April Exports Rise Despite West Asia Crisis | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో సానుకూలంగా ఎగుమతులు

May 3 2026 5:32 AM | Updated on May 3 2026 5:32 AM

India April Exports Rise Despite West Asia Crisis

కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ.. దేశ ఎగుమతుల రంగం ఏప్రిల్‌ నెల మొదటి మూడు వారాల్లో మంచి పనితీరు చూపించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు చెప్పారు. భారత్‌ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీ పరిశ్రమకు మంచి బలాన్నిస్తాయని పేర్కొన్నారు.

 ఏప్రిల్‌ నెల ఎగుమతులు, దిగుమతుల డేటాను వాణిజ్య శాఖ మే 15న విడుదల చేయనుంది. మార్చి నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. హర్మూజ్‌ జలసంధి మూసివేతతో ఎగుమతులు ఇతర మార్గాల ద్వారా వెళుతున్నట్టు మంత్రి గోయల్‌ చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పురోగతి గురించి మాట్లాడుతూ.. వారం క్రితం సంప్రదింపులు చక్కగా కొనసాగినట్లు చెప్పారు.

 అవి ఇక ముందూ కొనసాగుతాయన్నారు. యూఏఈ, యూకే, ఐరోపా సమాఖ్యతో పాటు నాలుగు ఐరోపా దేశాల కూటమి ఈఎఫ్‌టీఏతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవడాన్ని ప్రస్తావించారు. మరో 12 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. చిలీ, పెరూ, ఇజ్రాయెల్, గల్ఫ్‌ సహకార సమాఖ్య, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా, యూరేíÙయా ప్రాంత దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు మంత్రి గోయల్‌ వెల్లడించారు. 2025–26లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 88 బిలియన్‌ డాలర్లు లేదంటే 90 బిలియన్‌ డాలర్లు దాటి ఉండొచ్చన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement