ఏప్రిల్ 1 విడుదల
కొత్త పన్ను ప్రయోజనాలకు వెల్‌కమ్
1 నుంచి కీలక ప్రయోజనాల్లో మార్పులు
50 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధిలోకి హైదరాబాద్
బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌కూ చోటు
పిల్లల విద్యా వ్యయాలపై మరింత మినహాయింపు
ఆదాయపన్ను కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త పన్ను ప్రయోజనాల్లేకపోయినా.. ఉన్న వాటిల్లో వేతన జీవులు తప్పకుండా తెలుసుకోవాల్సిన కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి అద్దె భత్యం, పిల్లల విద్య కోసం చేసే ఖర్చులపై మరింత అదనపు ప్రయోజనం దక్కనుంది. యాజమాన్యం సమకూర్చే కారు, ఇంటి సేవలపై పన్ను బాధ్యతలు పెరగనున్నాయి.
బ్యాంకుల్లో నగదు జమలు, నగదు ఉపసంహరణల నుంచి.. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పాన్ సమరి్పంచడం వరకు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాహన కొనుగోళ్ల విషయంలోనూ పాన్ నిబంధనలు మారాయి. హోటల్ బిల్లులు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఒక పరిమితి దాటతే పాన్ సమరి్పంచాలి. ఇంటి యజమానితో తనకున్న సంబంధాన్ని కిరాయిదారు వెల్లడించాల్సిందే. ఇలా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను పరంగా వస్తున్న ముఖ్యమైన మార్పుల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ...
ఇప్పుడు హైదరాబాద్ వాసులకూ మరింత మెరుగైన హెచ్‌ఆర్‌ఏ పన్ను ప్రయోజనం అందుబాటులోకి వస్తోంది. ఈ నగరంలోని వేతన జీవులకు ఇప్పటి వరకు వేతనంలో భాగంగా పొందే ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)పై పన్ను మినహాయింపు 40 శాతంగానే ఉండేది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని వేతన జీవులకు మాత్రమే 50 శాతం పన్ను మినహాయింపు నిబంధన వర్తిస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి ఈ జాబితాలో కొత్తగా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు చేరనున్నాయి. దీంతో మొత్తం ఎనిమిది నగరాల పరిధిలోని వారు హెచ్‌ఆర్‌ఏపై మరింత అధిక ప్రయోజనం పొందే అవకాశం రానుంది. కొత్త ఆదాపన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి ఈ ప్రయోజనం లేదు. పాత పన్ను విధానంలో రిటర్నులు సమరి్పస్తున్న వారు హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇదీ ఫార్ములా..
హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపునకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(13ఏ) కింద వీటిని పేర్కొన్నారు.
ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)
⇒ యాజమాన్యం నుంచి వాస్తవంగా అందుకుంటున్న నెలవారీ హెచ్‌ఆర్‌ఏ మొత్తం.
⇒ ఇక్కడ పేర్కొన్న ఎనిమిది మెట్రోల్లో నివసించే వారికి మూలవేతనం, డీఏ మొత్తంలో 50 శాతం, ఇతర మెట్రోల్లోని వారికి 40 శాతం.
⇒ వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం నుంచి మూల వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చే మొత్తం. ఉదాహరణకు మూలవేతనం రూ.30వేలు ఉంటే.. ఇందులో 10% రూ.3,000 అవుతుంది. ప్రతి నెలా రూ.10,000 అద్దె చెల్లిస్తున్నట్టు అయితే ఇందులో రూ.3,000 మినహాయించగా రూ.7,000 వస్తుంది.
నోట్: ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే సంవత్సరం మొత్తం మీద ఆ మేరకు పన్ను మినహాయింపును ఆదాయం నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ ప్రయోజనానికి ఇవి తప్పనిసరి..
⇒ వేతన జీవులై ఉండాలి.
⇒ సీటీసీలో హెచ్‌ఆర్‌ఏ భాగంగా ఉండాలి.
⇒ అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉండాలి.
⇒ ఇంటి అద్దెకు సంబంధించి రుజువులు ఉండాలి.
⇒ పాత పన్ను విధానంలోనే రిటర్నులు వేయాలి.
వాహన అలవెన్స్‌లు
యాజమాన్యాలు ఉద్యోగుల అధికారిక, వ్యక్తిగత వినియోగానికి సమకూర్చే కార్ల విషయంలోనూ పన్ను పరంగా మార్పులు రానున్నాయి.
1. ఉద్యోగే కారును సొంతంగా కలిగి ఉండడం లేదా అద్దెకు తీసుకున్న సందర్భాల్లో.. అయ్యే వ్యయాలను పనిచేసే సంస్థ భరిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో..
⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.5,000తోపాటు, అదనంగా డ్రైవర్ కోసం చేసే ఖర్చు రూ.3,000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.7,000తోపాటు, డ్రైవర్ కోసం చేసే చెల్లింపులు రూ.3,000 పన్ను పరిధిలోకి వస్తాయి.
2. ఒకవేళ కారును యాజమాన్యం కొనుగోలు చేసి లేదా కిరాయికి తీసుకుని ఉద్యోగికి సమకూర్చిన సందర్భాల్లో..
⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.2,000తోపాటు డ్రైవర్‌కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాలి.
⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.3,000తోపాటు డ్రైవర్‌కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
3. ఒకవేళ ఉద్యోగి స్వయంగా సమకూర్చుకున్న కారుపై యాజమాన్యం నిర్వహణ అలవెన్స్ చెల్లిస్తున్నట్టయితే..
⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.5,000 మినహాయించగా వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాలి. డ్రైవర్ కోసమూ యాజమాన్యం చెల్లింపులు చేస్తుంటే మరో రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది.
⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.7,000 మినహాయించగా వచ్చే మొత్తంపై... డ్రైవర్ పేరిట మరో రూ.3,000పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
⇒ ఒకవేళ కారును పూర్తిగా అధికారిక అవసరాల కోసమే వినియోగించినట్టయితే, అటువంటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్త పెట్టుకోవాలి.
ఇంటి సేవలు, యుటిలిటీలు..
⇒ స్వీపర్లు, గార్డెనర్లు, వాచ్‌మెన్ వేతనాల కోసం ఉద్యోగులకు యాజమాన్యాలు చేసే వాస్తవ చెల్లింపులపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
⇒ గ్యాస్, విద్యుత్, నీటిని ఇతర సంస్థల నుంచి పొందినట్టయితే, ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు ఉద్యోగి చేసిన వాస్తవ చెల్లింపులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం తన సొంత వనరుల నుంచి వీటిని అందించినట్టయితే అప్పుడు ఒక్కోయూనిట్‌కు అయ్యే వాస్తవ వ్యయంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
⇒ ఒక సంవత్సరంలో పనిచేసే సంస్థ నుంచి పొందిన బహమతులు లేదా గిఫ్ట్ వోచర్ల విలువ రూ.15,000 మించితే ఆ మొత్తంపై పన్ను
చెల్లించాల్సి ఉంటుంది.
⇒ పనిచేసే సమయంలో సంస్థ ఉద్యోగులకు ఆహారం, పానీయాలను ఉచితంగా పెయిడ్ వోచర్ల రూపంలో అందిస్తుంటే ఆ మొత్తంపై పన్ను ఉండదు. ఒక్కో భోజనం ఖర్చు గరిష్ట పరిమితి రూ.200.
పిల్లల విద్య, హాస్టల్ ప్రయోజనాలు
పిల్లల విద్యకు సంబంధించి చేసే ఖర్చులపై మరింత పన్ను మినహాయింపునకు ఇకమీదట అవకాశం లభించనుంది. నెలవారీ ఒక్కొక్కరికి ఉన్న రూ.100 పరిమితి రూ.3,000కు పెరగనుంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, హాస్టల్ కోసం చేసే వ్యయాలపై ప్రస్తుతం ఉన్న నెలవారీ రూ.300 కాస్తా రూ.9,000కు పెరగనుంది. అంటే ఇంత మొత్తంపై ఇకనుంచి పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టం, 2026లోని 280 నిబంధన కింద ఈ ప్రయోజనాలను పొందుపరిచారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ ప్రయోజనం ఒకే విధంగా అమలు కానుంది.
రుజువులు అవసరం..
⇒ ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద పాత పన్ను విధానంలో పలు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలని భావించే వారు తప్పకుండా డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది.
⇒ హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ కోసం ఆర్థిక సంవత్సరంలో అద్దె చెల్లింపులు రూ.1,00,000 దాటితే అప్పుడు ప్రాపర్టీ యజమాని పేరు, చిరునామా, పాన్, అతడితో ఉన్న సంబంధం (రెంటల్ అగ్రిమెంట్) రుజువులు చూపించాలి.
⇒ లీవ్ ట్రావెల్ కన్సెషన్ కోసం ప్రయాణాలకు అయిన వ్యయాల రుజువులు సమరి్పంచాలి.
⇒ ‘ఇంటి ప్రాపర్టీ ఆదాయం’ నుంచి వడ్డీని మినహాయింపు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే గృహ రుణదాత పేరు, చిరునామా, పాన్ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది.
వీటిల్లోనూ మార్పులు..
⇒ బ్యాంకుల్లో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ప్రస్తుతం పాన్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు జమలు, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే పాన్ ఇస్తే సరిపోతుంది.
⇒ ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, ఉమ్మడి అభివృద్ధి (జాయింట్ డెవలప్‌మెంట్) లావాదేవీ విలువ రూ.20 లక్షలు మించితే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.
⇒ ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతర అన్ని వాహన కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఏ వాహనం కొనుగోలు చేస్తున్నా.. రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది.
⇒ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చెల్లింపులు రూ. లక్షకు మించితే పాన్ సమర్పణ తప్పనిసరి.
⇒ జీవిత బీమా పాలసీల కొనుగోలు సమయంలో ఇకమీదట పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.


