హెచ్‌యూఎల్‌ లాభం ప్లస్‌

HUL Q4 Results: Consolidated net profit up 12. 74percent YoY - Sakshi

క్యూ4లో రూ. 2,601 కోట్లు

షేరుకి రూ. 22 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13% బలపడి రూ. 2,601 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,307 కోట్లు ఆర్జించింది. అమ్మకాల పరిమాణం, మార్జిన్లు మెరుగుపడటం లాభాల వృద్ధికి దోహదపడింది.

నికర అమ్మకాలు 11 శాతం పుంజుకుని రూ. 14,926 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 13,468 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సర్వీసులతో కలిపి మొత్తం రూ. 15,375 కోట్ల నిర్వహణ ఆదాయం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 10,782 కోట్ల నుంచి రూ. 11,961 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది.

విభాగాలవారీగా: క్యూ4లో హెచ్‌యూఎల్‌ హోమ్‌ కేర్‌ విభాగం ఆదాయం 19% వృద్ధితో రూ. 5,637 కోట్లను తాకింది. సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ ఆదాయం 11% పుంజుకుని రూ. 5,257 కోట్లకు చేరింది. ఇక ఫుడ్స్, రిఫ్రెష్‌మెంట్‌ నుంచి 3 శాతం అధికంగా రూ. 3,794 కోట్లు నమోదైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌యూఎల్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14% ఎగసి రూ.10,143 కోట్లను తాకింది. 2021–22లో రూ. 8,892 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 15%పైగా జంప్‌చేసి రూ.59,443 కోట్లయ్యింది. అంతక్రితం రూ.51,472 కోట్ల టర్నోవర్‌ సాధించింది.  

 ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్‌ షేరు    1.7 శాతం క్షీణించి రూ. 2,469 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top