బైక్‌ కొనాలనుకుంటున్నారా? రెండు వారాలు ఆగండి | Bike Prices to Drop by ₹10,000–₹20,000 as GST on Two-Wheelers Revised from Sept 22 | Sakshi
Sakshi News home page

బైక్‌ కొనాలనుకుంటున్నారా? రెండు వారాలు ఆగండి

Sep 10 2025 11:30 AM | Updated on Sep 10 2025 1:51 PM

Huge GST Cut on Bikes Scooters under 350cc

విశాఖ సిటీ : ద్విచక్ర వాహనాలు కొనాలనుకుంటున్నారా? రెండు వారాలు ఆగండి. జీఎస్టీ స్లాబుల సవరణతో బైక్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయి. దసరా, దీపావళి పండగకు ముందే డిస్కౌంట్ల ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ద్విచక్ర వాహనాలు రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు తక్కువకు లభించనున్నాయి. జీఎస్టీ రేటు సవరణతో బైక్‌ మార్కెట్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఈ నెలాఖరు నుంచి భారీగా బైక్‌ విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కంపెనీలు తగ్గింపు ధరలను సైతం ప్రకటించేశాయి.

350 సీసీ లోపు బైక్‌లపై భారీగా తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను సవరించింది. ఇందులో 350 సీసీ వరకు ఉన్న బైక్‌లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. నవరాత్రి తొలి రాజు నుంచే ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో బైక్‌ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వినియోగదారులు వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. హీరో, హోండా, టీవీఎస్‌, బజాజ్‌ వంటి కంపెనీలతో పాటు జావా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, యెజ్డీ బైకులు కూడా ప్రస్తుతం కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. 350 సీసీ ఇంజన్‌ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌ల ధరలు మాత్రం పెరగనున్నాయి. ఇప్పటి వరకు వీటిపై 28 శాతం జీఎస్టీ ఉండగా.. ఈ నెల 22వ తేదీ నుంచి 40 శాతానికి పెరగనుంది. దీంతో లగ్జరీ బైక్‌ల ధరలు మాత్రం షాక్‌ కొట్టనున్నాయి. ఇప్పటి కంటే రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు పెరగనున్నాయి.

ధరలు తగ్గిస్తూ ప్రకటనలు
ప్రస్తుతం విశాఖ మార్కెట్‌లో 110, 125, 150 సీసీ ఇంజన్‌ బైక్‌ల వినియోగమే ఎక్కువగా ఉంది. వీటి కొనుగోలుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత 200, 250 సీసీ వరకు విక్రయాలు మధ్యస్తంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే వీటి ధరలు తగ్గిస్తూ కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. హీరో కంపెనీ బైక్‌లపై మోడల్‌, వేరియంట్‌ను బట్టి రూ.6 వేల నుంచి, హోండా కంపెనీ బైక్‌లపై రూ.8,500 నుంచి, టీవీఎస్‌ బైక్‌లపై రూ.8,700 నుంచి, బజాజ్‌ బైక్‌లపై రూ.8,500 నుంచి అత్యధికంగా రూ.15 వేలు వరకు తక్కువకు రానున్నాయి. అలాగే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350 సీసీ వరకు బైక్‌లపై రూ.19 వేలకు పైగా తక్కువకు లభించనున్నాయి.

మార్కెట్‌ జోష్‌
జీఎస్టీ రేట్లలో సవరణతో బైక్‌ మార్కెట్‌ జోష్‌ పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా దసరా, దీపావళికి ముందు కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. కానీ ఈసారి జీఎస్టీ రేటును తగ్గించి కేంద్రం కూడా కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు పోటాపోటీగా తగ్గింపు ధరలను ప్రకటించాయి. ఇప్పటికే కొనుగోలుదారులు ప్రస్తుతం బైక్‌లు కొనుగోలు చేయకుండా ప్రీ బుకింగ్‌లకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌ 22 తర్వాత కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు తగ్గింపు పొందాలని చూస్తున్నారు. ఈ కొత్త ధరలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బైక్‌ విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది బైక్‌ మార్కెట్‌కు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement