Sbi Home Loan Interest Rates: రుణ రేట్ల తగ్గింపుతో ఇళ్లకు డిమాండ్‌

Housing demand to rise SBI decision - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్‌) ఇళ్లకు డిమాండ్‌ బలంగా ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, కన్సల్టెంట్లు అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ అన్ని రకాల గృహ రుణాలను 6.7 శాతానికే ఇస్తున్నట్టు ప్రకటించడం, పలు ఇతర బ్యాంకులు సైతం గృహ రేట్లను గణనీయంగా తగ్గించడం డిమాండ్‌కు ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇప్పటికే కోటక్‌ బ్యాంకు సైతం గృహ రుణ రేట్లను గణనీయంగా తగ్గించగా.. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయాలు ప్రకటించొచ్చని రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ అంచనా వేస్తోంది.  

చదవండి : లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్

సానుకూల నిర్ణయం.. 
రుణం ఎంతనే దానితో సంబంధం లేకుండా క్రెడిట్‌ స్కోరు ఆధారితంగా గృహ రుణాలను 6.70 శాతం నుంచి ఆఫర్‌ చేస్తున్నట్టు ఎస్‌బీఐ గురువారం ప్రకటించడం గమనార్హం. అంతకుముందు వరకు రూ.75 లక్షల వరకు రుణాలపై 7.15 శాతం వడ్డీ రేటు అమల్లో ఉండేది. దీనిపై అనరాక్‌ గ్రూపు చైర్మన్‌ అనుజ్‌పురి స్పందిస్తూ.. ‘‘ఎస్‌బీఐ నిర్ణయం నిజంగా పోటీనిస్తుంది. ఈ కొత్త రేటు ప్రజాస్వామ్యయుతంగా ఉంది. ఏ బడ్జెట్‌లో కొనుగోలు చేసే వారైనా ప్రయోజనం పొందొచ్చు’’ అని చెప్పారు. 

ఎస్‌బీఐ సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సీజన్‌లో గృహ నిర్మాణ రంగం మంచిగా పుంజుకుంటుందన్నారు. ప్రాసెసింగ్‌ ఫీజుల మాఫీ కూడా సానుకూల నిర్ణయంగా పేర్కొన్నారు. హౌసింగ్‌ డాట్‌ కామ్, మకాన్, ప్రాప్‌టైగర్‌ పోర్టళ్ల గ్రూపు సీఈవో వికాస్‌ వాధ్వాన్‌ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

ఇప్పటికే డిమాండ్‌ ఊపందుకున్న గృహ నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ధరలు స్తబ్ధుగా ఉన్నందున కొనుగోలుదారులకు కొంత ఆదా కూడా అవుతుందన్నారు.ప్రముఖ బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రేరణనిస్తుందని సోతెబీ ఇంటర్నేషనల్‌ రియాలిటీ సీఈవో అమిత్‌ గోయల్‌ అన్నారు. 

చదవండి: లోన్‌ ఇవ్వనందుకు ఎస్‌బీఐకి మొట్టికాయ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top