
రంగుల పండుగ రోజున రూ.60 వేల కోట్లు వ్యాపారం
రంగుల పండుగ హోలీ కేవలం ఆనందం, ఐక్యతకు వేడుకగా మాత్రమేకాదు, దేశంలో గణనీయమైన ఆర్థిక వ్యాపారానికి తోడ్పాటునందిస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది హోలీ రోజున రూ.60,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది నమోదైన రూ.50,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తెలిపింది.
అన్ని రంగాల్లో ఆర్థిక వృద్ధి
సాధారణంగా పండుగ సమయాల్లో విభిన్న విభాగాల్లో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. స్వీట్లు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), గిఫ్ట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, దుస్తులు, పూలు, పండ్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుంది. పండుగలకు ముందే కొందరు ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే, పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంకొందరు ఈమేరకు ఖర్చు చేస్తారు. దాంతో రిటైల్ వ్యాపారులతోపాటు, దుకాణదారులతో మార్కెట్లు సందడిగా ఉంటాయి. గతంలో కంటే ఈసారి అధికంగా ఖర్చు చేస్తారని అంచనాలు ఉండడంతో స్థానిక వ్యాపారాలు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్థానిక ఉత్పత్తులకు గిరాకీ
ఈ ఏడాది వివిధ విభాగాల్లోని వ్యాపారులు భారత్‌లో తయారవుతున్న వస్తువులను ప్రమోట్ చేయడంపై దృష్టి సారించారు. వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులకు దూరంగా స్థానికంగా తయారైన హెర్బల్ కలర్స్, ట్రెడిషనల్ వాటర్ గన్స్ (పిచ్కారీస్), బెలూన్లు, పూజా సామగ్రిని ఎంచుకుంటున్నారు. ఈ మార్పు దేశీయ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుంది.
ఇదీ చదవండి: బ్యాంకింగ్‌కు జెనరేటివ్ ఏఐ బూస్ట్!
ఒక్క ఢిల్లీలోనే 3000కు పైగా కార్యక్రమాలు..
పెద్ద ఎత్తున హోలీ మిలన్ కార్యక్రమాలు, సమావేశాలు ఆర్థిక వృద్ధికి మరింత దోహదం చేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే ఇలాంటి 3,000కు పైగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడంతో వేదికలు, క్యాటరింగ్, సంబంధిత సేవలకు గిరాకీ పెరిగింది. వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరిచే ఈ ఉత్సవం సామర్థ్యం సాంస్కృతిక, సామాజిక కోణాలకు అతీతంగా దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
Comments
Please login to add a commentAdd a comment