ఇదివరకు ఇంటర్వ్యూల సమయంలో చాలామంది అభ్యర్థులు ఏఐ ఉపయోగిస్తున్నారని చెప్పిన గూగుల్, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ నియామక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగానికి అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది.
అభ్యర్థులు ఇంటర్వ్యూల సమయంలో AI టూల్స్‌ను ఉపయోగించేందుకు అనుమతించడం అనేది.. టెక్ రంగంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. కంపెనీ అభివృద్ధి చేసిన జెమిని ఏఐ (Gemini AI) అసిస్టెంట్‌ను కొంతమంది అభ్యర్థులు కోడింగ్ రౌండ్లలో ఉపయోగించేలా ఇంటర్వ్యూలు నిర్వహించడానికి సంస్థ సిద్ధమవుతోంది.
ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను ఈ ఏడాది చివర్లో అమెరికాలోని కొన్ని గూగుల్ క్లౌడ్ టీమ్‌లలో ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా జూనియర్, మిడ్ లెవల్ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులపై ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యంగా 'కోడ్ కంప్రిహెన్షన్' రౌండ్‌లో అభ్యర్థులు కోడ్‌ను చదవడం, లోపాలను గుర్తించడం, మెరుగుపరచడం వంటి పనుల్లో జెమిని సహాయం తీసుకోవచ్చు. అయితే తుది నిర్ణయం మాత్రం.. అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాతే ఉంటుంది.
ఇదీ చదవండి: జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!
గూగుల్ ఈ విధానాన్ని 'హ్యూమన్ లెడ్, AI అసిస్టెడ్'గా పేర్కొంటోంది. అంటే.. నిర్ణయం మనుషులదే అయినా, ఏఐ ఒక సహాయక సాధనంగా పనిచేస్తుంది. ప్రస్తుతం టెక్ రంగంలో ఏఐ ఆధారిత కోడింగ్ వేగంగా పెరుగుతోంది. కోడ్ రాయడం, పరీక్షించడం, మెరుగుపరచడం వంటి పనుల్లో ఇంజినీర్లు ఇప్పటికే ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఉద్యోగ ఇంటర్వ్యూలు దానికి తగిన విధంగా ఉండేలా గూగుల్ తగిన చర్య తీసుకుంటోంది.


