వెనకడుగులో.. బంగారం, వెండి

Gold, Silver prices weaken in MCX, New York Comex - Sakshi

రూ. 50,600 వద్ద కదులుతున్న 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 61,699 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,899 డాలర్లకు

24.41 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

గత వారం చివర్లో కన్సాలిడేషన్‌ బాట పట్టిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో కదులుతున్నాయి. యూఎస్‌ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి అటు స్టాక్‌ మార్కెట్లతోపాటు.. ఇటు బంగారం, వెండి తదితర విలువైన లోహాలపైనా ప్రభావం చూపుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్‌-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ ప్యాకేజీని ప్రకటించాలన్న అంశంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్‌ ముచిన్‌తో యూఎస్‌ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ నిర్వహిస్తున్న చర్చలు ఫలవంతం కాకపోపవచ్చన్న సందేహాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికలలోగా ఒప్పందం కుదిరే వీలున్నట్లు పెలోసీ పేర్కొనడం గమనార్హం. వారం మొదట్లో పసిడి ధరలు ర్యాలీ బాట పట్టడం ద్వారా 1,940 డాలర్లవైపు పయనించినట్లు బులియన్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఆ స్థాయి నుంచి వెనకడుగు వేయడంతో సాంకేతికంగా బలహీనపడ్డాయని తెలియజేశారు. దీంతో సమీప భవిష్యత్‌లో 1,850 డాలర్లవరకూ క్షీణించే వీలున్నట్లు అంచనా వేశారు. అయితే కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు చేపడుతున్న లిక్విడిటీ చర్యలు బంగారానికి జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఏదశలోనైనా ట్రెండ్‌ రివర్స్‌కావచ్చని విశ్లేషించారు.

క్షీణ పథంలో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం  రూ. 239 తక్కువగా రూ. 50,600 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 750 క్షీణించి రూ. 61,699 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 50,719 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,600 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి తొలుత ఒక దశలో 61,892 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,566 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.35 శాతం క్షీణించి 1,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.25 శాతం తక్కువగా 1,897 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 1.1 శాతం నష్టంతో ఔన్స్ 24.41 డాలర్ల వద్ద కదులుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top