పెట్టుబడిదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2017 ఏప్రిల్ 1కి ముందు చేసిన పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే ఆదాయానికి జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ (గార్) వర్తించవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది.
సవరించిన ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద.. 2017 ఏప్రిల్ 1కు ముందు చేసిన పెట్టుబడులను బదిలీ చేసినప్పుడు వచ్చిన ఆదాయం గార్ పరిధిలోకి రాదని పేర్కొంది. గార్, గ్రాండ్ ఫాదరింగ్‌కు మధ్య గందరగోళాన్ని తాజా ప్రకటన తొలగిస్తుందని ఏకేఎం గ్లోబల్ పార్ట్‌నర్, పన్ను నిపుణుడు సందీప్ సెహగల్ పేర్కొన్నారు. పాత పెట్టుబడులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేసినట్టు చెప్పారు.
గార్‌ను మొదటగా 2012–13 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడిదారులు పన్ను తప్పించుకునే ప్రయత్నాలను అరికట్టడమే దీని లక్ష్యం. అయితే ఈ నిబంధనలపై పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో అమలు ఆలస్యమైంది. చివరకు 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. అదే సమయంలో పాత పెట్టుబడులకు ‘గ్రాండ్‌ఫాదరింగ్’ రక్షణ కల్పించారు. ‘టైగర్ గ్లోబల్’ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గార్ అమలుపై సందిగ్ధత ఏర్పడింది.
2018లో ఫ్లిప్‌కార్ట్ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీడీటీ తాజా నోటిఫికేషన్‌తో 2017కు ముందు పెట్టుబడులపై లాభాలు భవిష్యత్తులో కూడా గార్‌కు లోబడవని స్పష్టం చేసింది. మొత్తంగా ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.


