భారీగా తగ్గిన ఇంధన వినియోగం 

Fuel Demand Contracts 9.1 Percent in FY21; First Since 1998-99 - Sakshi

2020–21లో 9.1 శాతం డౌన్‌ 

రెండు దశాబ్దాల్లో తొలిసారి 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఎకానమీ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం క్షీణించింది. ఇంధన వినియోగం ఇంతగా తగ్గడం 1998–99 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే ప్రథ మం. 2019–20లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 214.12 మిలియన్‌ టన్నులుగా ఉండగా 2020–21లో ఇది 194.63 మిలియన్‌ టన్నులకు క్షీణించింది. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) విడుదల చేసిన డేటాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.  

అత్యధికంగా డీజిల్‌ తగ్గుదల .. 
దేశీయంగా అత్యధికంగా ఉపయోగించే ఇంధనమైన డీజిల్‌ వినియోగం 12 శాతం తగ్గి 72.72 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. పెట్రోల్‌ డిమాండ్‌ 6.7 శాతం క్షీణించి 27.95 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. వంట గ్యాస్‌ ఎల్‌పీజీ వినియోగం మాత్రమే 4.7 శాతం పెరిగి 26.33 మిలియన్‌ టన్నుల నుంచి 27.59 మిలియన్‌ టన్నులకు చేరింది. కరోనా వైరస్‌ మహమ్మారి ఉపశమన చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొంత మేర సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం ఇందుకు దోహదపడింది. మరోవైపు, విమానయాన సంస్థలు చాలా భాగం మూతబడే ఉండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) డిమాండ్‌ 53.6 శాతం క్షీణించి 3.7 మిలియన్‌ టన్నులకు పరిమింతమైంది. నాఫ్తా అమ్మకాలు దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలో 14.2 మిలియన్‌ టన్నులుగా ఉండగా, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్‌ వినియోగం 6 శాతం పెరిగి 7.11 మిలియన్‌ టన్నులకు చేరింది. ఎకానమీకి ఊతమిచ్చే దిశగా కేంద్రం నిర్మాణ కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవడం ఇందుకు దోహదపడింది.  

క్రమంగా కోవిడ్‌ పూర్వ స్థాయికి.. 
లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేయడంతో గతేడాది ఏప్రిల్‌లో ఇంధన వినియోగం సగానికి సగం పడిపోయింది. ఆంక్షలను సడలించే కొద్దీ క్రమంగా కోలుకోవడం మొదలైంది. గతేడాది సెప్టెంబర్‌లో పెట్రోల్‌ అమ్మకాలు తిరిగి కోవిడ్‌–19 పూర్వ స్థాయికి చేరుకోగా, ఆ తర్వాత నెలల్లో పండుగ సీజన్‌తో డీజిల్‌ విక్రయాలు కూడా పుంజుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఇంధనానికి డిమాండ్‌ ఏకంగా 18 శాతం ఎగిసి 18.77 మిలియన్‌ టన్నులకు చేరింది. డీజిల్‌ వినియోగం అత్యధికంగా 27 శాతం, పెట్రోల్‌కు డిమాండ్‌ 25.7 శాతం ఎగిసింది. గత మార్చిలో బేస్‌ స్థాయి తక్కువగా ఉండటం కూడా ఇందుకు కొంత కారణమైంది.  లాక్‌డౌన్‌పరమైన ఆంక్షలు గతేడాది మార్చి ఆఖరు నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top