
గూగుల్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత తన జీవనశైలి మెరుగైందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. షావో చున్ చెన్(39) సింగపూర్‌లోని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు. కొన్ని కారణాలతో ఫిబ్రవరి 2024లో సంస్థ తనను తొలగించింది. చెన్ తన గూగుల్ కార్యాలయంలో వారానికి 40 గంటలకు పైగా పనిచేసేవారు.
ఉద్యోగం పోయిన తర్వాత సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా చేరారు. అక్కడ వారానికి మూడు గంటలు మాత్రమే పనిచేస్తున్నాడు. థాయ్‌లాండ్‌లో ఉంటున్న 39 ఏళ్ల చెన్ ప్రతి వారం సింగపూర్‌కు విమానంలో ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని సాగిస్తున్నాడని చెప్పాడు. తాను కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపాడు. వారానికి మూడు గంటల పాటు డిజిటల్ మార్కెటింగ్ క్లాసు బోధిస్తూ నెలకు 2,000 నుంచి 4,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.1.33 లక్షల నుంచి రూ.2.6 లక్షలు) సంపాదిస్తున్నాని చెప్పాడు. ఈ డబ్బు తన ప్రయాణాలకు, థాయ్‌లాండ్‌లో తన కుటుంబ ఖర్చులకు సరిపోతుందని చెన్ చెప్పారు.
ఇదీ చదవండి: సైబర్ మోసాల కట్టడికి ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’
2024 ఫిబ్రవరిలో గూగుల్ తనను తొలగించిన తర్వాత తాను ఆర్థికంగా స్వతంత్రుడినయ్యానని పేర్కొన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు గూగుల్‌లో అనవసరంగా సమయం వృథా చేశానని చెప్పారు. అనుకోకుండా కంపెనీ తనను తొలగించడంతో మంచే జరిగిందన్నారు. ఇకపై ఎక్కువ కాలం జీతంపై ఆధారపడాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు తెలిపారు. ఇప్పటికే చెన్ ఇతర మార్గాల ద్వారా సమకూరిన డబ్బుతో సుమారు 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17 కోట్లు) పోర్టఫోలియోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అసిస్టెంట్ లెక్చరర్‌గా చేస్తూనే యూట్యూబ్‌లో ఎడ్యుకేషనల్ కంటెంట్, కోచింగ్ బిజినెస్ ద్వారా కూడా తాను డబ్బు సంపాదిస్తున్నానని తెలిపారు. ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా గంటకు 500 డాలర్లు (సుమారు రూ.43,000) ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు.