డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !

Fintech Startups In India Raised More Than 2 Billion In The First Five Months Of 2021 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్‌ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్‌ రూ.2,860 కోట్లు, క్రెడ్‌ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్‌ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్‌ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్‌ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్‌ ఇన్సూరెన్స్‌ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి.
 
టాప్‌–10లో నాలుగు.. 
ఆసియాలో టాప్‌–10 డీల్స్‌లో పైన్‌ల్యాబ్స్‌ మూడవ స్థానంలో, క్రెడ్‌ నాల్గవ, రేజర్‌పే ఎనమిదవ, క్రెడిట్‌బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్‌ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్‌టెక్‌ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్‌టెక్‌ యూనికార్న్‌ కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్‌పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్‌టెక్‌ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్‌టెక్‌ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి.  

అంతర్జాతీయంగా సైతం.. 
తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్‌టెక్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో యూఎస్‌ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్‌ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్‌ జరిగాయి. 2020లో 502 డీల్స్‌ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్‌ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్, బ్యాంకింగ్‌ యాజ్‌ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది.  

చదవండి: భారత్‌ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top