ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లాల్సిందే
బ్యాంక్‌లు, బీమా సంస్థలకు ఆర్థిక శాఖ పిలుపు
న్యూఢిల్లీ: కఠిన పొదుపు దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) మళ్లాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ప్రజలు పెట్రోల్/డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది.
బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని, ఇంటి నుంచే పనిచేయాలని, కార్లలో ఒంటరిగా వెళ్లకుండా ఇతరులతో కలసి ప్రయాణించాలంటూ ప్రధాని దేశ ప్రజలను కోరడం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధంతో క్రూడ్, బంగారం ధరలు భారీగా ఎగబాకి.. దిగుమతి బిల్లు భారమవుతోంది. ఫలితంగా రూపాయి నేలచూపులు చూస్తోంది.
దీంతో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బీమా, ఆర్థిక సంస్థల అధికారులు, సిబ్బందిని ఈవీల్లో ప్రయాణించాలని కోరింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. తప్పనిసరి అయితే తప్పించి అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించుకోవాలని కూడా ఆర్థిక శాఖ కోరింది.


