జీఎస్‌టీ భారం తగ్గాలి... కేంద్రానికి వినతుల వెల్లువ

FADA Requested Centre To Reduce GST On Two Wheelers - Sakshi

ఎంటీఏఐ, ఫాడాల వినతి

న్యూఢిల్లీ: డిమాండ్‌ పెరగాలంటే ద్విచక్ర వాహనాలకు జీఎస్‌టీ 18 శాతానికి కుదించాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ద్విచక్ర వాహనాలు లగ్జరీ కాదు. జీఎస్‌టీ తగ్గాల్సిందే. జీఎస్‌టీ 28 శాతం, సెస్‌ 2 శాతం ఈ విభాగానికి శ్రేయస్కరం కాదు’ అని అసోసియేషన్‌ అభిప్రాయపడింది.    

జీఎస్‌టీ భారం తగ్గాలి- ఏంటీఏఐ
వైద్య పరికరాలు, కోల్డ్‌ చైన్‌ యూనిట్లు, విడిపరికరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), కస్టమ్స్‌ సుంకాలను తగ్గించాలని మెడికల్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంటీఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పరిశోధనా ఆధారిత మెడికల్‌ టెక్నాలజీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ– ఎంటీఏఐ ఇచ్చిన ప్రీ–బడ్జెట్‌ మొమోరాండంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 
- వైద్య పరికరాలు, మెడికల్‌ కోల్డ్‌ చైన్‌లపై జీఎస్‌టీని ప్రస్తుత 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం వల్ల వైద్య రంగంలో వ్యయాలు తగ్గుతాయి.  ఆరోగ్య సంరక్షణ రంగం విస్తరణకు ఈనిర్ణయం దారితీస్తుంది.  
-  ప్రస్తుతం వైద్య పరికరాల విడిభాగాలపై కస్టమ్‌ డ్యూటీ, జీఎస్‌టీ పూర్తి స్థాయి పరికరాల కంటే ఎక్కువ రేటుతో అమలవుతోంది.  
- ’యాడ్‌–వాలోరమ్‌’ అనే పదాన్ని తొలగించడం ద్వారా హెల్త్‌ సెస్‌ యాడ్‌ వాలొరమ్‌లో సవరణ చేయాలి. దీనివల్ల ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం (బీసీడీ) రేటుపై మాత్రమే సెస్‌ అమలు జరిగే వీలు ఏర్పడుతుంది. 
- కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)పై పన్ను మదింపు అలవెన్స్‌ అందించాలి. వైద్య పరికరాల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలకు పన్ను మినహాయింపు అవసరం. అన్ని స్థాయిలలో ఆరోగ్య సంరక్షణ కార్మికుల (హెచ్‌సీడబ్ల్యూ) నైపుణ్యం, ఈ రంగంలో పురోగతికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు అవసరం. ఆరోగ్య సంరక్షణ బీమా విస్తృతికి ప్రత్యేక దృష్టి పెట్టాలి.  

తొలుత వీటిపై దృష్టి – పవన్‌ చౌదరి, ఎంటీఏఐ చైర్మన్‌ 
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ స్థోమతను మెరుగుపరచడం, దాని ప్రయోజనాన్ని వీలైనంత ఎక్కువ మందికి విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే అధిక కస్టమ్స్‌ సుంకాలు, అదనపు ఆరోగ్య సెస్సుల భారం, వైద్య పరికరాల రంగంలో పరిశోధన–అభివృద్ధికి ప్రోత్సాహకాలు లేకపోవడం, క్రమబద్ధీకరించని పన్ను విధానం ఇక్కడ ప్రధాన సమస్యలు ఈ సమస్యల పరిష్కారానికి ప్రధానంగా కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  దీనికితోడు పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్‌లోని చాలా వైద్య పరికరాలపై కస్టమ్‌ డ్యూటీ విధానం భారతదేశంలో కంటే తక్కువగా ఉంది. ఇది  అక్రమ రవాణాకు దారితీసే అవకాశం ఉంది. 

చదవండి: జీఎస్‌స్టీ నుంచి లబ్ధిపొందేలా వేలకోట్ల ఫేక్‌ ఇన్వాయిస్‌లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top