IPOs: మరో రికార్డ్‌ దిశగా.. 28 కంపెనీలు.. రూ.38 వేల కోట్లు!

Expect 28 IPOs worth Rs 38000 cr in the next six months - Sakshi

ప్రథమార్థంలో ఇప్పటికే రూ.26300 కోట్లు సేకరణ

త్వరలో టాటా టెక్నాలజీస్, ఓయో, గో డిజిట్‌ ఐపీఓలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) లోనూ ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడుతోంది. తొలి అర్ధభాగం (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) లో 31 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకురాగా.. ద్వితీయార్థంలోనూ 28 కంపెనీలు నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. తద్వారా రూ.38,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించాయి. వివరాలు చూద్దాం.. 

ముంబై: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఐపీవోల ద్వారా 31 కంపెనీలు రూ. 26,300 కోట్లు సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. సెకండాఫ్‌లో మరింత అధికంగా నిధుల సమీకరణకు తెరలేవనుంది. ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల ప్రకారం మరో 41 కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా ఏకంగా రూ. 44,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి.

నిజానికి గతేడాది(2022–23) తొలి అర్ధభాగంతో పోలిస్తే ఇష్యూలు 14 నుంచి 31కు జంప్‌ చేసినప్పటికీ నిధుల సమీకరణ రూ. 35,456 కోట్ల నుంచి రూ. 26,300 కోట్లకు తగ్గింది. లిస్టింగ్‌ సన్నాహాలలో ఉన్న మొత్తం 69 కంపెనీలలో మూడు కొత్తతరం సాంకేతిక సంస్థలుకాగా.. ఉమ్మడిగా రూ. 12,000 కోట్ల సమీకరణపై కన్నేసినట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ ఎండీ ప్రణవ్‌ హాల్దియా వెల్లడించారు. 

గతంలో జోరుగా 
ఈ ఏడాది తొలి అర్ధభాగం(సెప్టెంబర్‌)లో న్యూటెక్‌ సంస్థ యాత్రా మాత్రమే లిస్టయ్యింది. రూ.775 కోట్లు సమీకరించింది. అయితే గతేడాది దిగ్గజాలు పేటీఎమ్, జొమాటో, నైకా లిస్ట్‌కావడం గమనార్హం! ప్రస్తుతం మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ద్వితీయార్థంలో పలు కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు హాల్దియా అభిప్రాయపడ్డారు. సుమారు రెండు దశాబ్దాల తదుపరి టాటా గ్రూప్‌ నుంచి టాటా టెక్నాలజీస్‌ లిస్ట్‌కానుంది.

ఇంతక్రితం 2004లో బాంబే హౌస్‌ కంపెనీ.. ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన విషయం విదితమే. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్‌ హై ఎండ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. ఆటోమోటివ్‌ ఈఆర్‌అండ్‌డీ సర్వీసులు సమకూర్చుతున్న కంపెనీ ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ టాటా మోటార్స్‌ 8.11 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు అంచనా. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లలోనే అత్యధికంగా 21 కంపెనీలు ఐపీవోలు చేపట్టాయి. వీటిలో మ్యాన్‌కైండ్‌ ఫార్మా రూ.4,326 కోట్లు, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.2,800 కోట్లు, ఆర్‌ఆర్‌ కేబుల్‌ రూ.1,964 కోట్లు సమీకరించాయి. అతితక్కువగా ప్లాజా వైర్స్‌ రూ. 67 కోట్లు అందుకుంది. 

ఓయో భారీగా 
ఆతిథ్య రంగ సేవలందించే ఓయో రూముల బ్రాండ్‌ కంపెనీ ఒరావెల్‌ స్టేస్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ బాటలో టాటా టెక్నాలజీస్, జేఎన్‌కే ఇండియా, డోమ్‌ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్, ఈప్యాక్‌ డ్యురబుల్స్, బీఎల్‌ఎస్‌ ఈ సర్వీసెస్, ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, సెల్లో వరల్డ్, ఆర్‌కే స్వామి, ఫ్లెయిర్‌ రైటింగ్‌ ప్రొడక్ట్స్, గో డిజిట్‌ ఇన్సూరెన్స్, క్రెడో బ్రాండ్‌ మార్కెటింగ్‌ తదితరాలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ ఏంజెల్‌ వన్‌ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top