విలాసాల మస్క్‌.. గర్ల్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌!, ఇంతకీ గ్రిమ్స్‌ ఎవరంటే..

Elon Musk Break Up With Girl Friend Grimes Confirmed - Sakshi

ఓపెన్‌ ఏఐ టెక్నాలజీతో వాహనాలను నియంత్రిచాలనుకోవడం వరకు ఓకే. కానీ,  జంతువుల్ని, మనుషుల్ని సైతం కంట్రోల్‌ చేయాలనే ప్రయత్నించడం!!..  ఇలా ఊహాతీతమైన ఎన్నో ఆలోచనలకు కేరాఫ్‌ ఎలన్‌ మస్క్‌. అపర కుబేరుడిగా, టెస్లా సీఈవోగా అంతకు మించి స్పేస్‌ ఎక్స్‌ లాంటి ప్రైవేట్‌ ఏజెన్సీ ఓనర్‌గా మస్క్‌ అందరికీ సుపరిచితుడే. అభిమానులు ఆయన్నొక ప్రత్యేకమైన మేధావిగా, ప్రత్యర్థులు పిచ్చోడిగా, మీడియా బహుతిక్క మనిషిగా ఎలివేట్‌ చేస్తుంటుంది. అలాంటి మస్క్‌.. వ్యక్తిగత జీవితానికి వచ్చే సరికి ఆగం ఆగం అవుతుంటాడు. 

తాజాగా తన డేటింగ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గ్రిమ్స్‌కు గుడ్‌బై చెప్పేశాడు యాభై ఏళ్ల ఎలన్‌ మస్క్‌!.  కారణాలేంటో తెలియదుగానీ.. వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటు మస్క్‌, అటు గ్రిమ్స్‌ సన్నిహితులు అమెరికా మీడియా హౌజ్‌లకు ఉప్పందించారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు మస్క్‌ సైతం ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.  ఇదిలా ఉంటే 2018 నుంచి కెనెడియన్‌ సింగర్‌ గ్రిమ్స్‌తో డేటింగ్‌ మొదలుపెట్టాడు మస్క్‌.

 

2020 మే నెలలో వీళ్లిద్దరూ ఓ కొడుకు పుట్టగా(ఎలన్‌ మస్క్‌ ఏడో బిడ్డ).. ఎవరికీ అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు ఈ టెస్లా బాస్‌. అప్పటి నుంచి ఈ జంట కొడుకును వెంటపెట్టుకునే చాలాసార్లు కెమెరా కళ్లకు చిక్కింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కొడుకు బాధ్యతను మాత్రం ఇద్దరూ కలిసే చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

33 ఏళ్ల గ్రిమ్స్‌ అసలు పేరు క్లెయిర్‌ బౌచర్‌. కెరీర్‌ మొత్తంలో ఇప్పటిదాకా ఐదు ఆల్బమ్‌లు చేసిందీమె.  వాన్‌కోవర్‌(కెనెడా)లో పుట్టి, పెరిగిన ఆమె.. 2007 నుంచి మ్యూజిక్‌ రంగంలోకి అడుగుపెట్టింది. గతంలో ఈమెపై డ్రగ్స్‌ తీసుకుందనే ఆరోపణలపై కేసులు కూడా నమోదు అయ్యాయి. కెనెడియన్‌ సింగర్‌ డెవోన్‌ వేల్ష్‌తో సహజీవనం ప్రేమవ్యవహారం నడిపిన బౌచర్‌(గ్రిమ్స్‌).. 2012 నుంచి ఆరేళ్లపాటు గిటార్‌ మ్యూజిషియన్‌ జేమీ బ్రూక్స్‌తో సహజీవనం చేసింది. ఆ తర్వాత బ్రూక్స్‌కి బ్రేకప్‌ చెప్పి.. ఎలన్‌ మస్క్‌తో డేటింగ్‌ మొదలుపెట్టింది.

 

గతంలో పలువురితో డేటింగ్‌ చేసిన మస్క్‌.. కెనడియన్‌ రచయిత జస్టిన్‌ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ పుట్టగా.. పది వారాలకే సడన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌​ సిండ్రోమ్‌ కారణంగా కన్నుమూసింది. ఆ తర్వాత ఐవీఎఫ్‌ ద్వారా 2004లో కవలల్ని, 2006లో ట్రిప్‌లెట్స్‌(ఒకే కాన్పులో ముగ్గురు)ను కన్నది ఈ జంట.  ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్‌ నటి టలులాహ్‌ రిలేతో డేటింగ్‌ చేశారు. 2010లో రిలేను వివాహం చేసుకుని.. 2012లో విడాకులిచ్చాడు.  ఆ మరుసటి ఏడాది రిలేను మళ్లీ పెళ్లి చేసుకున్న మస్క్‌..  చివరికి 2016 రిలేకు సైతం విడాకులిచ్చేశాడు.


నటి అంబర్‌ హర్డ్‌తో మస్క్‌

ఆ తర్వాత దక్కిన ఫేమ్‌, డబ్బుతో సెలబ్రిటీలతో కొంతకాలం డేటింగ్‌ చేశాడు. 2017లో నటి అంబర్‌ హర్డ్‌తో కొంతకాలం డేటింగ్‌ చేసినట్లు పుకార్లు వినిపించగా.. హర్డ్‌ మాజీ భర్త జానీ డెప్‌ ఆ ఆరోపణలు నిజమేనని ఆరోపించాడు. అయితే మస్క్‌, హర్డ్‌లు ఇద్దరూ ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వస్తున్నారు.

చదవండి: పోర్న్‌ మూవీలో నటించనున్న ఎలన్‌ మస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top