ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల లక్ష్యాలు మిస్‌..!

Electric two-wheeler sales may miss FY23 target of 10 lakh units by 20 percent - Sakshi

2022–23పై ఎస్‌ఎంఈవీ అంచనా

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. నిర్దేశించుకున్న 10 లక్షల యూనిట్ల కన్నా అమ్మకాలు 20 శాతం తక్కువగా నమోదు కావచ్చని పరిశ్రమ సమాఖ్య ఎస్‌ఎంఈవీ భావిస్తోంది. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల సబ్సిడీని విడుదల చేయకుండా ఆపి ఉంచడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2022 సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల అమ్మకాలు 6 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.

మూడు ప్రధాన ఎలక్ట్రిక్‌ టూవీలర్ల సంస్థలు (హీరో ఎలక్ట్రిక్, ఓలా, ఒకినావా) తొలిసారి 1 లక్ష వార్షిక విక్రయాల మైలురాయిని దాటాయి. ఈ మూడింటికి 50 శాతం పైగా మార్కెట్‌ వాటా ఉంది. 2022లో అమ్మకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ నీతి ఆయోగ్, ఇతరత్రా పరిశోధన ఏజెన్సీలు అంచనా వేసిన స్థాయిలో విక్రయాలు ఉండటం లేదని ఎస్‌ఎంఈవీ తెలిపింది. ’వాహన్‌’ పోర్టల్‌ గణాంకాల ప్రకారం గతేడాది నవంబర్‌లో 76,162 యూనిట్లు అమ్ముడు కాగా డిసెంబర్‌లో 28 శాతం తగ్గి 59,554 యూనిట్లకు పడిపోవడం ఒక హెచ్చరికగా కనిపిస్తోందని పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన తొలి తొమ్మిది నెలల్లో 5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు, ఇదే తీరు కొనసాగితే పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు నీతి ఆయోగ్‌ అంచనా వేసిన 10 లక్షల యూనిట్లకు 20 శాతం దూరంలో ఆగిపోవచ్చని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్‌ జనరల్‌ సోహిందర్‌ గిల్‌ చెప్పారు.
 
    గత రెండు నెలలుగా అమ్మకాలు తగ్గుతుండటానికి పలు అంశాలు కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల పైచిలుకు సబ్సిడీని చాలా నెలలుగా విడుదల చేయకుండా ఆపి ఉంచడంతో పలు కంపెనీలకు (ఓఈఎం) నిర్వహణ మూలధనంపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని గిల్‌ చెప్పారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 20 లక్షల యూనిట్ల అమ్మకాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు.

ఓఈఎంలపై ఆరోపణలు ..
దేశీయంగా విద్యుత్‌ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఫేమ్‌ ఇండియా ఫేజ్‌ 2 స్కీము కింద ఇస్తున్న సబ్సిడీలను కొన్ని తయారీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణలను కేంద్రం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రెండు కంపెనీలను, వాటి మోడల్స్‌ను ఫేమ్‌ స్కీము నుంచి సస్పెండ్‌ చేసింది. నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తగు ఆధారాలు ఇచ్చే వరకూ వాటి పెండింగ్‌ క్లెయిముల ప్రాసెసింగ్‌ను ఆపివేసింది. బెన్‌లింగ్‌ ఇండియా ఎనర్జీ అండ్‌ టెక్నాలజీ, ఒకాయా ఈవీ, జితేంద్ర న్యూ ఈవీ టెక్, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (గతంలో యాంపియర్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌), రివోల్ట్‌ ఇంటెలికార్ప్, కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్, ఏవన్‌ సైకిల్స్, లోహియా ఆటో ఇండస్ట్రీస్, ఠుక్రాల్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్, విక్టరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇంటర్నేషనల్‌ తదితర సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top