
ఆదాయం 2–3 శాతం మేర తగ్గొచ్చు
0.50 శాతం మేర మార్జిన్లు క్షీణించవచ్చు
అమ్మకాలు మాత్రం సానుకూలమే
2025–26 సంవత్సరంపై క్రిసిల్ అంచనా
ముంబై: వంట నూనెల రిఫైనరీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో సవాళ్లను ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా వాటి ఆదాయం 2–3 శాతం మేర తగ్గి, రూ.2.6 లక్షల కోట్లుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అమ్మకాలు మాత్రం 2024–25తో పోల్చి చూస్తే 2.8–3 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అయినప్పటికీ నిర్వహణ మార్జిన్ 0.30–0.50 శాతం వరకు తగ్గి 3.3–3.5 శాతం మధ్య ఉంటుందని తెలిపింది. మూలధన అవసరాలు, వ్యయాలు తక్కువగా ఉండడం కారణంగా వాటి పరపతి ప్రొఫైల్ స్థిరంగా ఉంటుందని తన నివేదికలో క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది.
మన దేశ వంట నూనెల వినియోగంలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. నూనెల దిగుమతుల్లో 50 శాతం పామాయిల్ కాగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఇతర నూనెల వాటా మిగిలిన 50 శాతంగా ఉంటోంది. సోయాబీన్ మినహా మిగిలిన ప్రధాన వంట నూనెలు అయిన సన్‌ఫ్లవర్, పామాయిల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. దీంతో కంపెనీల ఆదాయం కొంత క్షీణతను చూడనున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. బయోడీజిల్ తయారీ డిమాండ్ కారణంగా సోయాబీన్ నూనెల ధరలు పెరిగినట్టు తెలిపింది.
బ్రాండెడ్ కంపెనీల మార్జిన్లపై అధిక ప్రభావం
‘‘ఈ ఏడాది అమ్మకాలు స్థిరంగా 2.8–3% మేర వృద్ధి చెందొచ్చు. 25.5–26 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండొచ్చు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి 2.7 శాతం కంటే ఎక్కువే. గృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర విభాగాల నుంచి డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ జయశ్రీ నందకుమార్ పేర్కొన్నారు. అమ్మకాలు పెరగడం వల్ల ఆదాయ క్షీణత 2–3 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది.
కంపెనీలు సాధారణంగా 40–50 రోజుల అవసరాలకు సరిపడా నిల్వలు నిర్వహిస్తుంటాయి కనుక, ధరలు తగ్గడం వాటి మార్జిన్లను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. నాన్ బ్రాండెడ్ కంపెనీలతో పోలి్చతే బ్రాండెడ్ కంపెనీలు ఎక్కువ ఇన్వెంటరీలు (నిల్వలు) కలిగి ఉంటాయని, కనుక వాటి మార్జిన్లపై ఎక్కవ ప్రభావం పడుతుందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఫలితంగా రవాణా వ్యయాలు అధికమైతే.. అది నూనెల ధరలు ఎగిసేందుకు దారితీయొచ్చని అంచనా వేసింది.
చౌక దిగుమతుల నుంచి రక్షణ
ముడి నూనెలు, రిఫైనరీ నూనెల (శుద్ధి చేసిన) దిగుమతులపై భిన్నమైన సుంకాలతో పరిశ్రమకు ప్రభుత్వం మద్దతుగా నిలిచినట్టు క్రిసిల్ నివేదిక గుర్తు చేసింది. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించగా, అదే సమయంలో రిఫైనరీ నూనెలపై 35.75 శాతం కస్టమ్స్ డ్యూటీని కొనసాగించడాన్ని ప్రస్తావించింది. ఈ చర్య చౌక దిగుమతుల నుంచి దేశీ నూనె రిఫైనరీ సంస్థలకు రక్షణ నివ్వడమే కాకుండా, నూనెల ధరలు 5 శాతం వరకు తగ్గడానికి దారితీసినట్టు తెలిపింది.