విదేశాల్లో నేరుగా భారత కంపెనీల లిస్టింగ్‌

Direct Listing On Overseas Platform Revenue Secretary Tarun Bajaj Said - Sakshi

ముంబై: భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ అయ్యేందుకు అవసరమైన చట్ట సవరణలను పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. పలు స్టార్టప్‌లు (యూనికార్న్‌లు) నేరుగా విదేశాల్లో లిస్ట్‌ అయ్యేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం.

‘‘భారత సంస్థలు నేరుగా విదేశాల్లో లిస్ట్‌ అయ్యేందుకు అనుమతి ఉంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఈ దిశగా అనుమతించాలని కోరిన సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం’’ అని తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ఏటా జనవరి చివర్లో ప్రారంభమై రెండు దశల్లో కొనసాగుతాయని తెలిసిందే. ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో (ఐఎఫ్‌ఎస్‌సీ) సెక్యూరిటీలను లిస్ట్‌ చేసేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తరుణ్‌ బజాజ్‌ స్పష్టం చేశారు.

భారత కంపెనీలు విదేశాల్లో లిస్ట్‌ అయ్యేందుకు వీలు కల్పిస్తే అది పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా.. నిధుల సమీకరణను సులభతరం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో, అదే మాదిరి విదేశీ కంపెనీలు భారత స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్‌కు అనుమతించాలని సెబీ 2018లోనే ప్రతిపాదించింది.   

ధరల స్పీడ్‌కు వంట నూనెలు, పప్పుదినుసులే కారణం

ముంబై: వంట నూనెలు, పప్పు దినుసుల ధరల తీవ్రత వల్లే మొత్తం ద్రవ్యోల్బణం రేటు తీవ్రంగా ఉంటోదని తరుణ్‌ బజాబ్‌ పేర్కొన్నారు. మార్కెట్‌లో వాటి లభ్యత పెంపు, సరఫరాల వ్యవస్థ మెరుగుదల, సుంకాల తగ్గింపు వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం ప్రయత్నిస్తుందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అలాగే పంట దిగుబడి ఒకసారి అందుబాటులోకి వచ్చాక సమస్య మరికొంత దిగివస్తుందన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం  2 నుంచి 6 శాతం నిర్దిష్ట శ్రేణిలో  కొనసాగుతుందన్న అంచనాలను వెలువరించారు.  

చదవండి : మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు మూడు రెట్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top