డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలదే హవా!,10 ట్రిలియన్‌ డాలర్లకు!

Digital Payments Reach 10 10 Trillion In India By 2026 - Sakshi

ముంబై: ప్రజలు నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం ప్రతీ 10 లావాదేవీల్లో నాలుగు డిజిటల్‌ రూపంలోనే నమోదవుతున్నాయి. 2026 నాటికి యూపీఐ తదిర నగదు రహిత లావాదేవీల వాటా 65 శాతానికి చేరుకుంటుందని బీసీజీ, ఫోన్‌పే సంయుక్త నివేదిక అంచనా వేసింది. అలాగే, 2026 నాటికి డిజిటల్‌ చెల్లింపుల పరిశ్రమ 10 ట్రిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని.. అది ప్రస్తుతం 3 ట్రిలియల్‌ డాలర్ల స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. 

2020–21 నాటికి దేశ ప్రజల్లో 35 శాతం మందికే చేరువ అయిన యూపీఐ చెల్లింపుల సేవలు వచ్చే ఐదేళ్ల కాలంలో 75 శాతం ప్రజలను చేరుకుంటాయని పేర్కొంది. కరోనా అనంతరం దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక వెలువడడం గమనార్హం. మర్చంట్‌ పేమెంట్స్‌ ప్రస్తుత స్థాయి నుంచి ఏడు రెట్లు పెరిగి 2026 నాటికి 2.5–2.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని పేర్కొంది. మరింత మంది మర్చంట్లు (వర్తకులు) డిజిటల్‌ చెల్లింపులను అమోదిస్తే.. చిన్న వర్తకులకు రుణ సదుపాయం విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుందని బీసీజీ ఎండీ ప్రతీక్‌ రూంగ్తా చెప్పారు.  

చిన్న పట్టణాల నుంచి 
తదుపరి డిజిటల్‌ పేమెంట్స్‌ వృద్ధి టైర్‌ 3 నుంచి టైర్‌ 6 పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత రెండేళ్ల కాలంలో కొత్త కస్టమర్లలో 60–70 శాతం ఈ పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. డిజిటల్‌ చెల్లింపులను వర్తకులు ఆమోదించేలా వారిని ప్రోత్సహించాలని.. ఇందుకు వీలుగా స్థిరమైన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. తక్కువ విలువ లావాదేవీలపై ఎండీఆర్‌ రేటు 0.2–0.3 శాతం ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని సూచించింది.

అప్పుడు బ్యాంకులు, పేమెంట్‌ సంస్థలు వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలుంటుందని పేర్కొంది. ‘‘డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరగడం బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతోంది. కొన్ని బ్యాంకులు డిమాండ్‌ను తట్టుకోలేకున్నాయి. యూపీఐ లావాదేవీల వైఫల్యానికి ఇదే కారణం. అందుకుని బ్యాంకులు కోర్‌ బ్యాంకింగ్‌కు వెలుపల క్లౌడ్‌ తదితర ఆప్షన్లను పరిశీలించాలి’’ అని ఈ నివేదిక సూచించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top