చైనాలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఉన్నాయా..?

Details About Mutual Fund In China - Sakshi

చైనా పెట్టుబడులతో కూడిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు లేదా ఈటీఎఫ్‌లు ఉంటే చెప్పగలరు? – ఎ.రాజన్‌ 
విదేశాల్లో పెట్టుబడులు పెట్టేట్టు అయితే అది పూర్తి వైవిధ్యంతోనే ఉండాలి. అందుకుని ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టని పథకాలను ఇన్వెస్టర్లు పరిశీలించాలి. వివిధ దేశాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే పథకాలను ఎంపిక చేసుకోవాలి. ఏ దేశం కేంద్రంగా పనిచేసే కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇన్వెస్ట్‌ చేస్తున్నాయనేది కూడా కీలకమే అవుతుంది. ఉదాహరణకు యూఎస్‌ ఆధారిత ఫండ్స్‌ అమెరికా కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కానీ, పరిశీలించి చూస్తే అమెరికాకు చెందిన ఎన్నో కంపెనీలు, ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజాలకు అంతర్జాతీయంగా కన్జ్యూమర్లు ఉంటారు. అంటే కేవలం అమెరికాపైనే ఆధారపడిన కంపెనీలు కావు అవి. ఉదాహరణకు ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), యాపిల్, మైక్రోసాఫ్ట్‌ తదితర కంపెనీలు. కనుక అమెరికాలో ఇన్వెస్ట్‌ చేసే పథకం ఒక ప్రాంతానికి సంబంధించినది అయినప్పటికీ.. అంతర్జాతీయంగా ఎక్స్‌పోజర్‌ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పుకున్న అంశాల కోణం నుంచి చూస్తే రిటైల్‌ ఇన్వెస్టర్లు చైనాలో ప్రత్యేకంగా ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో ఎక్స్‌పోజర్‌ తీసుకోకపోవడమే మంచిది. అయినప్పటికీ చైనాలోనూ పెట్టుబడుల ఎక్స్‌పోజర్‌ కోరుకునేట్టు అయితే అది కూడా మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5–10 శాతానికి మించకుండా జాగ్రత్త పడాలి. చైనా థీమ్‌తో ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో.. మూడు వరకు ఉన్నాయి. అందులో రెండు మెయిన్‌లాండ్‌ చైనాపై దృష్టి సారిస్తే, మరో పథకం హ్యాంగ్‌సెంగ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అయితే చాలా వరకు అంతర్జాతీయ ఫండ్స్‌ తాజా పెట్టుబడులను స్వీకరించడాన్ని ఇటీవల నిలిపివేశాయి. మొత్తం ఫండ్స్‌ పరిశ్రమకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల పరిమితి (విలువ పరంగా) దాటిపోయింది. అయినప్పటికీ కొన్ని పథకాలు తమ సిప్‌ పెట్టుబడులను కొనసాగిస్తున్నాయి.  ఫండ్స్‌ పరిశ్రమ మొత్తానికి సంబంధించి విదేశీ పెట్టుబడులు 7 బిలియన్‌ డాలర్లు మించకూడదు. అయితే ఈ పరిమితిని సెబీ త్వరలోనే పెంచే అవకాశం ఉంది. అప్పుడు  ఫండ్స్‌ పథకాలు తిరిగి తాజా పెట్టుబడులు అనుమతిస్తాయి.  విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఒక్కటే మార్గం అనుకోకండి. ఆర్‌బీఐ లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద ఒక ఇన్వెస్టర్‌ విడిగా ఒక ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల డాలర్లను విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇది రూ.1.90 కోట్ల కంటే ఎక్కువ. రిటైల్‌ ఇన్వెస్టర్‌కు ఈ పరిమితి సరిపోతుంది. విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను ఆఫర్‌ చేసే బ్రోకర్ల వద్ద ట్రేడింగ్‌ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అప్పుడు నేరుగా విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. విదేశీ ఈటీఎఫ్‌లను కూడా పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకోవచ్చు.   

అత్యవసర నిధిని బ్యాంకు ఎఫ్‌డీలో కాకుండా డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా..? ఎందుకంటే నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. కనుక ఎఫ్‌డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. – దిగ్విజయ్‌  
అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్‌ చేయాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్‌ ఫండ్‌ లేదా అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగానూ అనుకూలం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్‌ ఫండ్స్‌లో అయితే పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అయితే సమకూరే వడ్డీ ఆదాయం ఏటా పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. అదే డెట్‌ ఫండ్‌ అయితే పెట్టుబడిని మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. అది కూడా లాభం నుంచి ద్రవ్యోల్బణ తరుగు ప్రభావం మినహాయించిన తర్వాతే. ఒకవేళ డెట్‌ ఫండ్‌లో పెట్టుబడిని మూడేళ్లలోపు ఉపసంహరించుకుంటే కనుక అప్పుడు లాభం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరే ఆదాయానికి కలుస్తుంది. అయితే, ఎఫ్‌డీలతో పోలిస్తే డెట్‌ ఫండ్స్‌ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. డెట్‌ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్‌ ఫండ్స్, అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌తక్కువ రిస్క్‌ విభాగంలోకి వస్తాయి. అయితే, అధిక రాబడుల కోసం డెట్‌ ఫండ్స్‌లో ఎంపిక చేసుకునే పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడుల కోసం వెళితే అధిక రిస్క్‌ను ఆహ్వానించినట్లే. అధిక నాణ్యమైన డెట్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసిన పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. 

- ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌)

చదవండి: మ్యూచువల్‌ ఫండ్‌ను కానుకగా ఇవ్వొచ్చా..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top