Unlock Effect : ఉత్సాహంలో కార్పోరేట్‌ కంపెనీలు

Corporate Sector Have Full Hope On Unlock procedure To Revive Economic activity - Sakshi

ఎకానమీలో ఆశారేఖలు కనిపిస్తున్నాయి !

రాష్ట్రాల్లో అన్‌ లాకింగ్‌ ప్రక్రియపై కార్పొరేట్‌ సర్వే వెల్లడి

ఈ ఏడాదిలో మంచి ఫలితాలు ఉంటాయన్న విశ్లేషణ  

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన స్థానిక లాక్‌డౌన్‌లను తాజాగా అన్‌లాక్‌ చేస్తుండడం కార్పొరేట్‌ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎకానమీలో తిరిగి క్రియాశీలత ప్రారంభమయ్యిందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు ఫిక్కీ–ధృవా అడ్వైజర్స్‌ నిర్వహించిన ఒక సంయుక్త సర్వే తెలిపింది. కరోనా సెకండ్‌వేవ్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై జరిపిన సర్వే ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 

►  వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో ఎకానమీ మరింత క్రియాశీలమవుతుందని కార్పొరేట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

► స్థానికంగా రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్ల వల్ల తమ వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినట్లు సర్వేల్లో పాల్గొన్న 212 కంపెనీల్లో 60 శాతం వెల్లడించాయి. 

► సెకండ్‌ వేవ్‌ తీవ్రత, వివిధ రాష్ట్రాల్లో పలు విధాలైన ఆంక్షలు వినియోగ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. డిమాండ్‌ భారీగా పడిపోయింది. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోసైతం వినియోగ డిమాండ్‌ దెబ్బతిందని సర్వేలో వెల్లడైంది.  

► కొత్త కేసులు గణనీయంగా తగ్గుతుండడంతో తిరిగి వ్యాపారాలు, ఆర్థిక క్రియాశీతల ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని కార్పొరేట్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  

► అవసరమని సర్వేలో ప్రతినిధులు అభిప్రాయడ్డారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విస్తృతితోపాటు భౌతిక దూరం పాటించడం,  విధిగా మా స్క్‌లు ధరించడం వంటి సామాజిక బాధ్యతలకు అత్యధిక ప్రాధాన్యత అవసరమని పేర్కొన్నారు.  

► తదుపరి వేవ్‌లను అరికట్టడానికి తీసుకోవాల్సిన మరో ఐదు ప్రధాన చర్యలను సర్వే సూచించింది. ఇందులో మొదటిది చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య భద్రతా మౌలిక రంగంపై పెట్టుబడులను పెంచాలి. రెండవది తగిన ఔషధాల నిల్వ అవసరం. తాత్కాలిక వైద్య ఏర్పాట్లు విస్తృతం చేయడం మూడవది. వ్యాధి నిర్థారణ కేంద్రాలు భారీగా ఏర్పాటు నాల్గవది. ఇక ఐదవ సూచన విషయానికి వస్తే, ప్రభుత్వ నిధులతో వ్యాక్సిన్‌ తయారీకి ఒక దేశీయ సంస్థ ఏర్పాటు.  

►వ్యాక్సినేషన్‌ విస్తృతి కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ డిపోలు, పాఠశాలలు, గ్రామీణ పంచాయితీ కార్యాలయాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. మురికివాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. అలాగే పెద్దగా కదలడానికి ఇబ్బందిపడే వృద్ధులు, అంగవైకల్యం కలవారికి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అవసరమని సిఫారసు చేసింది.

రికవరీకి మద్దతుగా పటిష్ట చర్యలు అవసరం: పీహెచ్‌డీసీసీఐ
ఎకానమీ రికవరికీ మద్దతునివ్వడానికి ప్రభుత్వ పరంగా పటిష్ట చర్యలు అవసరమని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ప్రెసిడెంట్‌ సంజయ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. కనీసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తించే విధంగానైనా పారిశ్రామిక ప్రధాన ముడి పదార్థాల దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే గత ఏడాదిగా 50 శాతంపైగా ధరలు పెరిగిన కొన్ని ప్రధాన కమోడిటీలపై ఎగుమతి సుంకాలను విధించాలని విజ్ఞప్తి చేశారు. 2021–22లో అధిక ఆర్థిక వృద్ధిని సాధించడానికి వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు పునరుత్తేజం అవసరమని, ఇందుకు తగిన చర్యలు తప్పవని సూచించారు. ఈ దిశలో కుటుంబాల వినియోగ డిమాండ్‌ పెంచడానికీ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో మూలధన పెట్టుబడుల విస్తృతితోనే ఇది సాధ్యమవుతుందని అగర్వాల్‌ విశ్లేషించారు. ఆయా అంశాల్లో లక్ష్యాలను సాధించడానికి నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ పెట్టుబడులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇంటి నుంచి పనులు, నిధుల కొరతల వల్ల ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపులకు ఎటువంటి విఘాతం కలుగరాదన్నారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ చట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బందీ రాకూడదని స్పషం చేశారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top