కల్తీ తేనె కలకలం: మరింత కరోనా ముప్పు

 Chinese sugar found in Indian honey CSE report - Sakshi

తేనె పేరుతో  చైనా సుగర్‌  తాగేస్తున్న ప్రజలు: సీఎస్‌ఈ అధ్యయనం

ఇది  కరోనా ముప్పును మరింత పెంచుతుంది

సీఎస్‌ఈ అధ్యయనం అవాస్తవం: ఖండిస్తున్న ఎఫ్‌ఎంసీజీ సంస్థలు

 తమది స్వచ్ఛమైన తేనె, కల్తీ లేదు : డాబర్, పతంజలి వివరణ

సాక్షి, న్యూఢిల్లీ: రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్‌, ఇమ్యూనిటీ బూస్టర్‌ అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా? అయితే మీకొక షాకింగ్‌ రిపోర్టు.. చైనా సుగర్‌ సిరప్‌తో గుర్తు పట్టలేనంతగా దేశంలో కల్తీ తేనెను చలామణీ చేస్తున్నవ్యవహారం కలకలం రేపుతోంది.  చిన్నా పెద్ద సహా  దాదాపు అన్ని బ్రాండ్ల తేనె చక్కెర సిరప్‌తో  కల్తీ చేస్తున్నారని తమ అధ్యయనం తేలిందని ప్రకటించింది.  దేశంలోని 13 ప్రధాన బాండ్లలో  డాబర్, పతంజలి, బైద్యనాథ్ జండుతో సహా మొత్తం 10 సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీమయమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) తేల్చి చెప్పింది.  కరోనా సంక్షోభ సమయంలో  ప్రజలు తేనెకు బదులుగా, ఎక్కువ చక్కెరను తింటున్నారని, ఇది కోవిడ్-19 ప్రమాదాన్నిమరింత పెంచుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

తేనెలో చైనా చక్కెరతో కలిపి కల్తీ  తేనెను విక్రయిస్తున్నారని ఇటీవల  నిర్వహించిన  క్వాలిటీ పరీక్షల్లో  నిర్దారణ అయిందని తెలిపింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి) సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (కాల్‌ఎఫ్)లో వీటి నమూనాలను పరీక్షించారు. జర్మనీలోని ఒక ప్రత్యేక ప్రయోగశాలలో ఎన్‌ఎంఆర్‌ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు, చాలా బ్రాండ్లు విఫలమయ్యాయి. పరీక్షించిన 13 బ్రాండ్లలో మూడు బ్రాండ్లు మాత్రమే ఎన్‌ఎంఆర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయని సీఎస్‌ఈ వెల్లడించింది.  అయితే ఈ ఆరోపణలను డాబర్, పతంజలి, జండు  ప్రతినిధులు ఖండించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగానే ఉందని వాదిస్తున్నాయి. సీఎస్ఈ విడుదల చేసిన రిపోర్టు అవాస్తవమైందనీ,  ఇండియన్ నాచురల్ హనీ ఇండస్ట్రీని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ  వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై  ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ డాబర్  స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె డాబర్ హనీ అని, తమ తేనె 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది.  తమ తేనెలో కల్తీ జరగలేదని  ట్వీట్ చేసింది.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతదేశంలో తేనెటీగల పెంపకందారులు లాభాలు క్షీణించాయని, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్‌ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ తెలిపారు. శీతల పానీయాలపై  2003, 2006 సంవత్సరాల్లో తాముచేపట్టిన పరిశోధనలో పరిశోధనలలో కనుగొన్న దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామన్నారు. అతి ఘోరమైన, అధునాతన కల్తీ ఇదని, ఇప్పటివరకు  గుర్తించినదానికంటే చాలా ఎక్కువ  హానికరమని వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం మనం ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని  నరేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 కోవిడ్‌-19 పై పోరులో భాగంగా చాలామందితేనెను విరివిగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తేనెలోకల్తీని గుర్తించడం కష్టమని ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. సీఎస్‌ఈ అధ్యయనం ప్రకారం , ప్రారంభంలో తేనెలో తీపిని పెంచేందుకు మొక్కజొన్న, చెరకు, బియ్యం, బీట్‌రూట్ నుండి తీసిన చక్కెరను తేనెలో కల్తీ చేసేవారు. ఇది సీ3, సీ4 పరీక్షల్లో బయటపడుతుంది. కానీ ఈ  కొత్త కల్తీ ‘చైనీస్ సుగర్’ ను న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్‌ఎంఆర్) అనే పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించగలం. ప్రముఖ బ్రాండ్లైన డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు, హిత్‌కారీ,  అపిస్ హిమాలయా సంస్థలనుంచి సేకరించిన తేనె నమూనాలు ఎన్ఎంఆర్ పరీక్షలో విఫలమయ్యాయి. మారికో  సఫోలా హనీ, మార్క్‌ఫెడ్ సోహ్నా, నేచర్  నెక్టా మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top