
పండగ సీజన్‌కు ముందే పప్పుల ధరలు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే శనగపప్పుకు డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగిన సరఫరా లేకపోవడంతో గత నెల నుంచి వీటి ధరలు 10 శాతం పెరిగాయి. దాంతో సమీప భవిష్యత్తులో ఇంకెంత పెరుగుతుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
స్వీట్‌లు, లడ్డూలు, ఇతర వంటకాల తయారీలో శనగపప్పు అవసరం అవుతుంది. అయితే అంతకుముందు నెల వీటి ధరలు దాదాపు 5% పడిపోయాయి. దాంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కానీ తాజా నివేదికల ప్రకారం ఇటీవల కాలంలో వీటి ధర 10 శాత పెరగడం మళ్లీ ఆందోళన కలిగిస్తుంది.
ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్(ఐపీజీఏ) ప్రకారం..శనగపప్పుకు స్థిరమైన డిమాండ్ ఉంది. దేశీయంగా సరఫరా తగ్గింది. ప్రభుత్వం వద్ద పరిమిత స్టాక్ ఉంది. కానీ, రానున్న రోజుల్లో దిగుమతులు పెరుగుతాయి. దాంతో డిమాండ్‌ను అదుపుచేయవచ్చు. దానివల్ల ధరలు పెరగకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం శనగపప్పు ధరలు పెరుగుతాయని ముందే ఊహించి పసుపు బఠానీలను భారీగా దిగుమతి చేసుకుంది. కానీ ఆశించిన విధంగా శనగపప్పు డిమాండ్‌ను భర్తీ చేయలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఇదిలాఉండగా, సెప్టెంబరు నాటికి ఆఫ్రికా, ఆస్ట్రేలియాల నుంచి శనగపప్పు దిగుమతులు పెరగడం వల్ల ధరలు మరింత పెరగకుండా నిరోధించవచ్చని కొందరు వ్యాపారులు తెలిపారు. పసుపు బఠానీలను ఎలాంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకునేలా అనుమతులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ధరలు అదుపులో ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాతావరణ సమస్యలు, ఆఫ్రికా సరఫరాలో జాప్యం, పండగ సీజన్, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వడం వంటి కారణాలతో రానున్న రోజుల్లో కంది పప్పు ధరలు కూడా పెరుగుతాయిని నిపుణులు అంచనా వేస్తున్నారు.