
దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరు మహా నగరంలో ట్రాఫిక్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణానికే గంటలకొద్దీ సమయం పడుతోంది. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి ముఖ్యంగా రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి దీర్ఘకాలిక ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడానికి నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. బుధవారాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్హెచ్) అమలు చేయాలని అక్కడి ఐటీ సంస్థలకు సూచించారు.
ఎడతెగని ట్రాఫిక్
బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి చాలా కాలంగా నగరవాసులకు, ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తోంది. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ‘ఎక్స్’లో ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ‘నేను ఇంటి నుంచి ఉదయం 9 లేదా 9:30 గంటలకు బయలుదేరితే ఏ 12 గంటలకో ఆఫీసు చేరుకుంటాన్నాను. ఇది కేవలం 6 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే! నాకు సొంత కారు ఉన్నా ట్రాఫిక్‌కు భయపడి దాన్ని బయటకు తీసే ఆలోచన కూడా చేయడం లేదు. ఏ ఉబెర్ లాంటిదో బుక్ చేసుకోవాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో వాళ్లు ఒక్కో రైడ్‌కు రూ .500–రూ .600 తీసుకుంటున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘అదృష్టవశాత్తూ మా ఆఫీస్‌లో హైబ్రిడ్ విధానం అనుసరిస్తున్నారు. కానీ ఆఫీస్‌కు బయలుదేరినప్పుడు ఈ గందరగోళాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇది పనిచేసే ఉత్సాహాన్ని హరిస్తుంది. ఎవరోఒకరు ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల చాలాసార్లు మీటింగ్‌లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఆఫీస్‌కి 1-2 కిలోమీటర్ల పరిధిలో నివసించే సహోద్యోగులు కూడా క్యాబ్‌లలో వచ్చి ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం ఎందుకని నడిచి వస్తున్నారు. బెంగళూరు లాంటి నగరానికి ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు.
ఉదయం విపరీత ట్రాఫిక్
పలు ప్రధాన ఐటీ పార్కులు, కంపెనీలకు నిలయమైన ఓఆర్ ఆర్ పై ఒత్తిడిని తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ ప్రతిపాదిత డబ్ల్యూఎఫ్ హెచ్ ప్రణాళికను రూపొందించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ కార్తీక్ రెడ్డి తెలిపారు. ఈ ఒత్తిడిని తగ్గించడానికి కంపెనీలు ఉదయం 7.30 గంటలకే పనివేళలను ప్రారంభించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారం మధ్యలో అంటే బుధవారం వర్క్‌ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ట్రాఫిక్ అధికారులు సిఫార్సు చేస్తున్నారు.
వ్యూహం ఇదీ..
ట్రాఫిక్ విభాగం, బీబీఎంపీ (నగర కార్పొరేషన్), బీఎంటీసీ (బస్ సర్వీస్), ఐటీ రంగానికి చెందిన కీలక భాగస్వాములతో కూడిన సంయుక్త సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించారు. ఓఆర్ ఆర్ వెంబడి పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను వేగవంతం చేయడం, ప్రత్యేక బస్ బేల ఏర్పాటు, ప్రధాన టెక్ పార్కుల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం సహా అత్యవసర మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రతిపాదనలపై ఐటీ కంపెనీలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే వారంలో ఒక్కరోజైనా నగరంలో ఎంతో కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది.