రూ.8.4 లక్షల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ

Banks expected to restructure loans up to Rs 8.4 lakh crore - Sakshi

మొత్తం రుణాల్లో 7.7 శాతం లేదంటే భారీగా ఎన్‌పీఏలు

ఇండియా రేటింగ్స్‌  అండ్‌ రీసెర్చ్‌ అంచనా

ముంబై: ఒక్కసారి రుణ పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తూ ఆర్‌బీఐ ఇటీవల పరపతి విధాన కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోగా.. ఈ కారణంగా బ్యాంకులు సుమారు రూ.8.4 లక్షల కోట్ల మేర రుణాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో ఇది 7.7 శాతం అవుతుందని పేర్కొంది.

ఒకవేళ రుణాల పునరుద్ధరణకు అవకాశం లేకపోతే ఈ రూ.8.4 లక్షల  కోట్ల రుణాల్లో సుమారు 60 శాతానికి పైగా ఎన్‌ పీఏలుగా మారొచ్చని అంచనాకు వచ్చింది. పునర్‌ వ్యవస్థీకరణ బ్యాంకుల లాభాలను కాపాడుతుందని, చేయాల్సిన కేటాయింపులు తగ్గుతాయని పేర్కొంది. కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ ఇప్పటికి రెండు విడతల పాటు మొత్తం ఆరు నెలలు (2020 మార్చి నుంచి ఆగస్ట్‌) రుణ చెల్లింపులపై మారటోరియం (విరామం)కు అవకాశం ఇచ్చింది.

మూడో విడత మారటోరియం కాకుండా పునర్‌ వ్యవస్థీకరణకు అవకాశం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసిన వినతుల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అన్నిరంగాలకు చెందిన అన్ని రుణాలకు కాకుండా పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో ఒక్కో ఖాతాను విడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆర్‌బీఐ  సూచించింది.

గత సంక్షోభ సమయాల్లో మాదిరిగా కాకుండా ఈ విడత కార్పొరేట్, నాన్‌ కార్పొరేట్, చిన్న వ్యాపార సంస్థలు, వ్యవసాయ రుణాలు, రిటైల్‌ రుణాలకు ఈ విడత పునర్‌ వ్యవస్థీకరణలో అధిక వాటా ఉండనుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో పునర్వ్యవస్థీకరించిన రుణాల్లో 90 శాతం కార్పొరేట్‌ రుణాలేనని పేర్కొంది. ఈ విడత (ఆగస్ట్‌ తర్వాత) పునర్వ్యస్థీకరణ రుణాల్లో రూ.2.1 లక్షల కోట్లు నాన్‌ కార్పొరేట్‌ విభాగాల నుంచే ఉంటాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌  పేర్కొంది.  

కార్పొరేట్‌ లో ఎక్కువ రిస్క్‌
కార్పొరేట్‌ విభాగంలో రూ.4 లక్షల కోట్ల రుణాలు కరోనా ముందు నుంచే ఒత్తిడిలో ఉన్నాయని, ఇవి మరో రూ.2.5 లక్షల కోట్ల మేర పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్‌ అంచనాగా ఉంది. ‘‘కార్పొరేట్‌ విభాగంలో పునర్‌ వ్యవస్థీకరించే రుణాల మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నుంచి రూ.6.3 లక్షల కోట్ల వరకు ఉంటాయి. బ్యాంకులు అనుసరించే విధానాలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ విభాగంలోని రుణాల్లో 53 శాతం అధికరిస్క్‌ తో కూడినవే. మరో 47 శాతం రుణాలకు మధ్యస్థ రిస్క్‌ ఉంటుంది.

రియల్‌ ఎస్టేట్, ఎయిర్‌ లైన్స్, హోటల్స్, విచక్షణారహిత వినియోగ రంగాల్లో ఎక్కువ రుణాలను పునరుద్ధరించాల్సి రావచ్చు. అయితే విలువ పరంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, నిర్మాణ రంగానికి చెందిన రుణాలు ఎక్కువగా ఉండొచ్చు. నాన్‌ కార్పొరేట్‌ విభాగంలో పునరుద్ధరించాల్సిన రుణాల్లో సగం ఎంఎస్‌ఎంఈ విభాగం నుంచి ఉంటాయి. మొత్తం మీద బ్యాంకింగ్‌ రంగంలో కేటాయింపులు 16–17 శాతం తగ్గుతాయి’’అని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ తన నివేదికలో వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top