బ్యాంక్‌ లాకర్‌ డెడ్‌లైన్‌: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్‌..

Bank Locker Deadline Important updates for bank locker holders - Sakshi

Bank Locker Deadline: విలువైన వస్తువులు, ఆభరణాలు, పత్రాలను భద్రపరచడానికి అత్యంత సురక్షితమైన సాధనం బ్యాంక్ లాకర్‌ అని మనందరికీ తెలుసు. ఈ బ్యాంక్ లాకర్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి లాకర్ పరిమాణాన్ని బట్టి ఖాతాదారుల నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేస్తాయి. ఈ లాకర్లకు సంబంధించి ప్రతి బ్యాంకుకు సొంత నిబంధనలు ఉంటాయి.

తాజగా బ్యాంక్ లాకర్ల వినియోగదారులకు ఎస్‌బీఐతో సహా అనేక బ్యాంకులు ముఖ్యమైన అలర్ట్‌ అందించాయి. సవరించిన లాకర్ ఒప్పందంపై జూన్ 30 లోపు సంతకం చేయడం తప్పనిసరి అని సూచించాయి. 

ఆర్బీఐ మార్గదర్శకాలేంటి?
జనవరి 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకు లాకర్ ఒప్పంద ప్రక్రియను 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే జూన్ 30 నాటికి 50 శాతం లాకర్ ఒప్పందాల  పునరుద్ధరణ పూర్తవ్వాలి. ఆ తర్వాత సెప్టెంబరు 30 నాటికి 75 శాతం, డిసెంబర్‌ 31 నాటికి 100 శాతం పూర్తవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ సహా అనేక బ్యాంకులు లాకర్‌ ఒప్పందాలు పూర్తి చేయాలని కస్టమర్లకు అలర్ట్‌లు పంపిస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 2021 ఫిబ్రవరిలో ఆర్బీఐ ఈ ఆదేశాలను జారీ చేసింది. తర్వాత 2021 ఆగస్టులో లాకర్ ఒప్పంద నియమాలను సవరించింది. 

ఎటువంటి చార్జ్‌ లేకుండా..
బ్యాంకుల్లో కొత్త లాకర్‌లను పొందే కస్టమర్‌ల కోసం ఒప్పంద నియమాలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి.  ఇప్పటికే లాకర్లు కలిగిన కస్టమర్‌లు ఒప్పంద ప్రక్రియను  2023 జనవరి 1 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా  చాలా మంది కస్టమర్‌లు సవరించిన ఒప్పందాలను పూర్తి చేయలేదు.  దీంతో ఆర్బీఐ గడువును 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది.  ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్‌ల నుంచి ఎటువంటి చార్జ్‌లు వసూలు చేయకుండా స్టాంప్ పేపర్‌పై ఒప్పందాలను పూర్తి చేయాలి.

లాకర్ నిబంధనలు ఇవే..
బ్యాంక్ లాకర్లు వివిధ నియమ నిబంధనలకు లోబడి ఉంటాయి. వర్షాలు, వరదలు, భూకంపం, పిడుగులు పడటం వంటి విపత్తులు, అల్లర్లు, తీవ్రవాద దాడుల వంటి ఘటనల కారణంగా లాకర్‌కు కలిగే నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించవు.  అయితే లాకర్ భద్రతను నిర్ధారించడం బ్యాంక్ బాధ్యత. అగ్నిప్రమాదం, దొంగతనం, చోరీలు, దోపిడీలు, భవనం కూలడం, బ్యాంకు నిర్లక్ష్యం, బ్యాంకు ఉద్యోగులు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాల్లో మాత్రం బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారాన్ని అందించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top