దేశీ ఎయిర్‌లైన్స్‌కి ఊరట  | Aviation Sector Gets Partial Relief | Sakshi
Sakshi News home page

దేశీ ఎయిర్‌లైన్స్‌కి ఊరట 

Apr 2 2026 3:55 AM | Updated on Apr 2 2026 7:45 AM

Aviation Sector Gets Partial Relief

ఏటీఎఫ్‌ రేటు పెంపు 8.5%కి పరిమితం 

విదేశీ ఎయిర్‌లైన్స్‌కి 114.5% పెంపు 

వాణిజ్య ఎల్‌పీజీ, ప్రీమియం పెట్రోల్‌ రేట్లు అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగిసినప్పటికీ విమాన ఇంధనం రేట్లను భారీగా పెంచకుండా దేశీ విమానయాన సంస్థలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొంత ఊరటనిచ్చాయి. వాస్తవానికి రెట్టింపు స్థాయిలో పెంచాల్సినప్పటికీ పెంపును 8.5%కి పరిమితం చేశాయి. అయితే, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ (ఎల్‌పీజీ), ప్రీమియం పెట్రోల్‌ రేట్లను మాత్రం పెంచాయి. తాజా పరిమాణంతో దేశీ ఎయిర్‌లైన్స్‌కి ఏటీఎఫ్‌ ధర ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 8,289 (8.56%) పెరిగి రూ. 1,04,927కి చేరింది. కానీ విదేశీ ఎయిర్‌లైన్స్, నాన్‌–శెడ్యూల్డ్, చార్టర్‌ ఫ్లయిట్స్‌కి మాత్రం 114.5% ఎగిసింది. రూ.1,10,703 పెరిగి రూ. 2,07,341కి చేరింది. ఇది రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. 

‘విమాన టికెట్‌ చార్జీలు భారీగా పెరగకుండా ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు, దేశీ ఎయిర్‌లైన్స్‌పై భారాన్ని తగ్గించేందుకు, కీలక తరుణంలో పరిశ్రమలో స్థిరత్వాన్ని తెచ్చేందుకు ఈ విధానం దోహదపడుతుంది.  ఎయిర్‌ కనెక్టివిటీకి ఆటంకాలు ఏర్పడకుండా చూడటం ద్వారా ఎకానమీకి కూడా ప్రయోజనం చేకూర్చగలదు’ అని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఏవియేషన్‌ పరిశ్రమకు, విమాన ప్రయాణికులపై పెను భారం పడకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌ పేర్కొన్నాయి.  

సాధారణ పెట్రోల్, వంట గ్యాస్‌ ధర యథాతథం.. 
19 కేజీల వాణిజ్య సిలిండర్‌ రేటు ఢిల్లీలో రూ. 195.50 మేర పెరిగి రూ. 2,078.50కి చేరింది. ప్రీమియం డీజిల్‌ రేటు లీటరుకు రూ. 1.50 మేర పెరిగి రూ. 92.99కి చేరగా, 100 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధర రూ. 11 పెరిగి రూ. 160కి చేరింది. సాధారణ, అన్‌బ్రాండెడ్‌ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ వంట గ్యాస్‌ ధరల్లో ఎటువంటి మార్పుల్లేవు. వంట గ్యాస్‌ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రతి సిలిండర్‌పై రూ. 380 మేర ఆదాయ నష్టం వాటిల్లుతోంది’ అని పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ శాఖ పేర్కొంది.

ఇండిగో ఇంధన చార్జీల పెంపు..
ఏటీఎఫ్‌ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఇంధన చార్జీలను రూ. 275–10,000 వరకు పెంచుతున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా ప్రయాణ దూరాన్ని బట్టి దేశీ రూట్లలో ఫ్లయిట్లకు సంబంధించి ఈ పెంపు రూ. 275–950 శ్రేణిలో, ఇంటర్నేషనల్‌ ఫ్లయిట్స్‌లో రూ. 900 – 10,000 శ్రేణిలో ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో మార్చి 14 నుంచి ఇండిగో రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement