Anil Ambani: రిలయన్స్‌ క్యాపిటల్‌ దివాలా ప్రొసీడింగ్స్‌ షురూ!

Anil ambani reliance capital insolvency procedure started By NCLT - Sakshi

ఆర్‌బీఐ పిటిషన్‌ను అడ్మిట్‌ చేసిన ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ 

ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన  రిలయన్స్‌ క్యాపిటల్‌పై ఐబీసీ కింద దివాలా చర్యలు ప్రారంభించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌), ముంబై బెంచ్‌ అనుమతించింది. కంపెనీపై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని గత వారం ఆర్‌బీఐ ఎన్‌సీఎల్‌టీ  ముంబై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని అడ్మిట్‌ చేస్తూ, ప్రదీప్‌ నరహరి, దేశ్‌ముఖ్, కపిల్‌ కుమార్‌ వాద్రాలతో కూడిన ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ సోమవారం సాయంత్రం రూలింగ్‌ ఇచ్చింది.  పాలనా సంబంధ అంశాల్లో డిఫాల్ట్‌ అయ్యిందని పేర్కొంటూ అనిల్‌ అంబానీ ప్రమోట్‌ చేస్తున్న రిలయన్స్‌ క్యాపిటల్‌ బోర్డ్‌ను నవంబర్‌ 29న  సెంట్రల్‌ బ్యాంక్‌ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై. నాగేశ్వరరావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా నియమించింది.  

పూర్తి సహకారం: రిలయన్స్‌ క్యాపిటల్‌ 
ఇదిలాఉండగా, కంపెనీ ప్రమోటర్లు ఒక ప్రకటన చేస్తూ, 227 సెక్షన్‌ కింద ఎన్‌సీఎల్‌టీలో ఆర్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. రుణదాతలు, కస్టమర్‌లు, ఉద్యోగులు, షేర్‌హోల్డర్‌లతో సహా తన వాటాదారులందరి పూర్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఐబీసీ ప్రక్రియ ద్వారా వేగవంతమైన దివాలా పరిష్కార పక్రియకోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రకటన తెలిపింది.   ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, సంబంధిత వర్గాలను సంప్రదించి ఒక కంపెనీని  దివాలా– లిక్విడేషన్‌ ప్రొసీడింగ్‌ల కింద కేంద్రం నోటిఫై చేయడానికి  దివాలా కోడ్‌ (ఐబీసీ)లోని సెక్షన్‌ 227 వీలుకల్పిస్తుంది. రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణదాతలకు దాదాపు రూ.19,805 కోట్ల బకాయి ఉంది. వీటిలో మెజారిటీ నిధిని ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్‌ ఇండియా కింద జారీ చేసిన బాండ్ల ద్వారా సమీకరించడం జరిగింది.  

ఆర్‌బీఐ ‘ఐబీసీ’ పిటిషన్‌ను  ఎదుర్కొంటున్న మూడవ సంస్థ 
రిలయన్స్‌ క్యాపిటల్‌ దివాలా కోడ్‌ కింద ఇటీవల ఆర్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసిన మూడవ అతిపెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ). ఇంతక్రితం శ్రేయీ గ్రూప్, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లపై ఈ తరహా పిటిషన్‌లను ఆర్‌బీఐ దాఖలు చేసింది. రిలయన్స్‌ క్యాపిటల్‌పై దాదాపు రూ.40,000 కోట్ల రుణం భారం ఉన్నట్లు రిలయన్స్‌ క్యాపిటల్‌ తన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ప్రకటించింది. రెండవ త్రైమాసికంలో రూ.1,156 కోట్ల నష్టాలను ప్రకటించింది. 2020–21లో కంపెనీ రూ.19,308 కోట్ల ఆదాయంపై రూ.9,287 కోట్ల నష్టాన్ని పోస్ట్‌ చేసింది.  

చదవండి :Reliance Capital: అనిల్‌ అంబానికి షాక్‌ !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top