ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!

After IOC, Bharat Petroleum too promises EV chargers at its petrol pumps - Sakshi

ముంబై: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) భారతదేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాటలోనే నడిచేందుకు సిద్దం అయ్యింది. దేశవ్యాప్తంగా 19,000 పెట్రోల్ పంపులను కలిగి ఉన్న చమురు సంస్థ ఇప్పుడు ఈవి ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పెట్రోల్ బంకుల వద్ద సుమారు 7,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికను రూపొందించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకోవడంతో ఆ రంగంలో కూడా అడుగుపెట్టాలని బీపీసీఎల్ చూస్తుంది.

దేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో కొత్త వ్యాపారంలో తన మార్క్ చూపాలని చూస్తుంది. భారత్ పెట్రోలియం ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈవీ పరిశ్రమకు డిమాండ్ పెరగుతున్న నేపథ్యంలో పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి 7,000 స్టేషన్ల ఏర్పాటు చేయలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ స్టేషన్లను 'ఎనర్జీ స్టేషన్లు' అని పిలుస్తారు" అని ఆయన అన్నారు.

(చదవండి: ఆన్‌లైన్‌ సేల్స్‌ అదరహో..! అదరగొడుతున్న ఇళ్ల అమ్మకాలు..!)

రాబోయే మూడేళ్లలో భారతదేశం అంతటా తన పెట్రోల్ బంకుల వద్ద 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) ప్రకటించిన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ ప్రకటన చేసింది. 2024 నాటికి 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల లక్ష్యాన్ని సాధించడానికి రాబోయే 12 నెలల్లో 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను, ఆ తర్వాత రెండేళ్లలో మరో 8,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 3న చమురు కంపెనీ ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top