
గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం, నిర్మాణంలో నాణ్యత, ఇంట్లోకి సహజ కాంతి వచ్చేలా ఏర్పాట్లు.. గృహ కొనుగోలుదారుల ప్రధాన డిమాండ్లు ఇవే. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన సాధనం స్థిరాస్తి రంగమేనని అనరాక్ గ్రూప్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. 63 శాతం మంది ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు 22 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఈ విభాగంలో పెట్టుబడులకు 7 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా టారిఫ్‌లు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు వెనుకాడుతున్నారని వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరో
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సుమారు 2 లక్షల యూనిట్లను లాంచ్ చేశాయి. గతేడాది ఇదే కాలంలో 2.28 లక్షల కొత్త ఇళ్లను ప్రారంభించాయి. గడువులోగా నిర్మాణాల పూర్తి, డెలివరీ, నాణ్యత కారణంగా డిమాండ్, సప్లయి సమానంగా ఉంటున్నాయి. పెట్టుబడి కోసం, భవిష్యత్తు అవసరాల కోసం కంటే సొంతంగా తాము నివాసం ఉండేందుకే ఇళ్లు కొంటున్నారు. నాణ్యమైన నిర్మాణాలు, మంచి లొకేషన్, వినూత్న డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 65 శాతం మంది సొంత వినియోగానికే గృహాలను కొనుగోలు చేస్తుంటే.. 35 శాతం మంది పెట్టుబడుల రీత్యా కొంటున్నారు.
ప్రీమియం ఇళ్లకు ఆదరణ..
ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. రూ.45 లక్షలలోపు ధర ఉన్న అందుబాటు గృహాల విభాగంపై కొనుగోలుదారుల ఆసక్తి క్షీణించింది. 2020 హెచ్1లో ఈ విభాగం వాటా 36 శాతంగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 17 శాతానికి తగ్గింది. ప్రాంతం, డిజైన్, యూనిట్ సైజ్ చిన్నగా ఉండటమే ఆఫర్డబుల్ గృహాలకు డిమాండ్ తగ్గటానికి ప్రధాన కారణం. 36 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉన్న ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. 25 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షలు, 17 శాతం మంది రూ.45 లక్షలలోపు, 12 శాతం మంది రూ.1.50–రూ.2.50 కోట్ల మధ్య, 10 శాతం మంది రూ.2.50 కోట్లకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
లాంచింగ్ ప్రాజెక్టులపై ఆసక్తి..
సిద్ధంగా ఉన్న ఇళ్లకంటే లాంచింగ్ యూనిట్లకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద, లిస్టెడ్ డెవలపర్లు భారీ ఎత్తున లాంచింగ్స్ చేస్తుండటమే ఈ ఆసక్తికి ప్రధాన కారణం. పేరున్న డెవలపర్లయితే గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం, నిర్మాణంలో నాణ్యత పాటిస్తారని కస్టమర్లు భావిస్తున్నారు. గతేడాది హెచ్1లో రెడీ టు హోమ్స్, న్యూ లాంచింగ్స్ నిష్పత్తి 20:25గా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 16:29గా ఉంది.
త్రీ బీహెచ్‌కే ఇళ్లకే మొగ్గు..
టాప్–7 నగరాల్లో కస్టమర్లు పెద్ద సైజు గృహాలకు ఆసక్తి చూపిస్తున్నారు. 45 శాతం మంది త్రీ బీహెచ్‌కేలకు మొగ్గు చూపిస్తుండగా.. 40 శాతం మంది టూ బీహెచ్‌కేకు జై కొడుతున్నారు. మూడేళ్ల క్రితం ఫోర్ బీహెచ్‌కేలకు 4 శాతం మంది ఆసక్తి చూపించగా.. 2025 హెచ్1 నాటికిది 7 శాతానికి పెరిగింది. 8 శాతం మంది వన్ బీహెచ్‌కేలకు ఇంట్రెస్ట్ ఉన్నారు. హైదరాబాద్‌లో చూస్తే.. 55 శాతం మంది త్రీ బీహెచ్‌కేలకు, 38 శాతం మంది టూ బీహెచ్‌కే, 5 శాతం వన్ బీహెచ్‌కే, 2 శాతం మంది ఫోర్ బీహెచ్‌కే, ఆపైన విస్తీర్ణమైన ఇళ్లకు మొగ్గు చూపిస్తున్నారు.