2020లో 10 పెన్నీ స్టాక్స్‌ బొనాంజా | 10 Penny stocks rallies in 2020: Ace equity report | Sakshi
Sakshi News home page

2020లో 10 పెన్నీ స్టాక్స్‌ బొనాంజా

Dec 29 2020 3:19 PM | Updated on Dec 29 2020 3:26 PM

10 Penny stocks rallies in 2020: Ace equity report - Sakshi

ముంబై, సాక్షి: ఈ కేలండర్‌ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు ఆటుపోట్లను చవిచూశాయి. తొలుత జనవరిలో సరికొత్త గరిష్టాలవైపు నడక సాగించాయి. అయితే చైనాలోని వుహాన్‌లో ఊపిరిపోసుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌ ధాటికి మార్చికల్లా కనిష్టాలకు పడిపోయాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకున్న సహాయక చర్యలతో తిరిగి నెల రోజుల్లోనే రికవరీ బాట పట్టాయి. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్లుబడుల వెల్లువతో సరికొత్త గరిష్టా రికార్డులను సాధిస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడేళ్లుగా పెద్దగా వృద్ధి చూపని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు మధ్య, చిన్నతరహా కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం మార్కెట్లను మించి లాభపడుతూ సరికొత్త గరిష్టాలను చేరాయి.

పెన్సీ స్టాక్స్‌ 
2019లో పెన్నీ స్టాక్స్‌గా నిలిచిన 10 కంపెనీల షేర్లు ఈ ఏడాది(2020) లాభాల పరుగందుకున్నాయి. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక శాతం రిటర్నులు అందించాయి. ఇందుకు రూ. 25 ధరకంటే తక్కువగా ఉన్న షేర్లను మాత్రమే పరిగణించినట్లు ఏస్‌ ఈక్విటీ పేర్కొంది. రూ. 100 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) మించని కంపెనీలను మాత్రమే మదింపులోకి తీసుకున్న్లట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం.. (బోరోసిల్‌ -ఫైనోటెక్స్‌ కెమ్‌.. యమస్పీడ్‌)

అలోక్‌ గెలాప్‌
సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సుమారు 38 శాతం వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో అలోక్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగింది. ఫలితంగా అలోక్ ఇండస్ట్రీస్‌ షేరు 2020లో ఏకంగా 602 శాతం దూసుకెళ్లింది. 2019 డిసెంబర్‌ 31న రూ. 3.04గా నమోదైన ఈ షేరు వారాంతానికల్లా రూ. 21.4కు చేరింది. 

లాభాల బాట
అలోక్‌ ఇండస్ట్రీస్‌ బాటలో టెక్నాలజీ సేవల కంపెనీ స్యుబెక్స్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో ఈ షేరు గతేడాది చివర్లో నమోదైన రూ. 5.90 నుంచి వారాంతానికల్లా రూ. 29.70కు ఎగసింది. వెరసి 403 శాతం ర్యాలీ చేసింది. ఈ జాబితాలో కర్దా కన్‌స్ట్రక్షన్స్‌ షేరు రూ. 23.74 నుంచి 376 శాతం జంప్‌చేసింది. వారాంతానికల్లా రూ. 113ను దాటేసింది. ఇక టెక్‌ సొల్యూషన్స్‌ అందించే కెల్టన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ షేరు రూ. 18 నుంచి రూ. 72.40కు పురోగమించింది. ఇది 301 శాతం వృద్ధికాగా.. క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీ సీజీ పవర్‌ ఇండస్ట‍్రియల్‌ షేరు రూ. 10.82 నుంచి రూ. 43.20వరకూ పెరిగింది. ఇది 299 శాతం లాభంకావడం గమనార్హం!

ఇదేవిధంగా రతన్‌ ఇండియా ఇన్‌ఫ్రా స్టాక్‌ రూ. 1.87 నుంచి రూ. 6.60కు బలపడింది. వెరసి 253 శాతం వృద్ధి చూపింది. హెల్త్‌కేర్‌ కంపెనీ మార్క్‌శాన్స్‌ ఫార్మా రూ. 16.71 స్థాయి నుంచి రూ. 58కు ఎగసింది. 247 శాతం లాభపడింది. టెలికం సేవల కంపెనీ టాటా టెలీసర్వీసెస్‌ షేరు రూ. 2.25 నుంచి 237 శాతం ర్యాలీ చేసింది. రూ. 7.59ను తాకింది. దుస్తుల తయారీ కంపెనీ బాంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌ రూ. 4.20 నుంచి 220 శాతం జంప్‌చేసింది. రూ. 13.44కు చేరింది. ఇక మౌలిక రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్‌ షేరు రూ. 1.96 నుంచి రూ. 6.16కు పెరిగింది. ఇది 214 శాతం లాభం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement