టేకులపల్లి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడమే కాక వ్యవసాయాధికారుల సూచనల మేరకే రైతులు పంటల సాగు చేయాలని ఇల్లెందు వ్యవసాయ సహాయ సంచాలకులు గుగులోత్ లాల్‌చంద్ సూచించారు. మండలంలోని కొత్తతండా(పీ) గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైన వర్షపాతం ఇంకా కురవలేదని, కనీసం 60 – 70 మి.మీ. వర్షపాతం నమోదైతేనే విత్తనాలు నాటాలని తెలిపారు. లేకపోతే విత్తనాలు మొలకెత్తక నష్టం వస్తుందన్నారు. అంతేకాక ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్నకు బదులు పెసర, కంది, నువ్వులు, పలు రకాల కూరగాయలు, ఆయిల్‌పామ్‌పై దృష్టి సారించాలని తెలిపారు. వరి సాగు చేయాలనుకునే రైతులు బీపీటీ 5204, హెచ్‌ఎంటీ, తెలంగాణ సోనా, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798, డబ్ల్యూజీఎల్ 962 వంటి మేలైన రకాలే ఎంచుకోవాలని సూచించారు. కాగా, నిబంధనలు ఉల్లంఘించి నకిలీ, అనుమతి లేని విత్తనాల విక్రయాలను కట్టడి చేసేందుకు తనిఖీలు చేపడుతున్నామని ఏడీఏ తెలిపారు. సదస్సులో ఏఓ నీరుడు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న విద్యార్థిని మృతి
పాల్వంచరూరల్: వారం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంటర్ విద్యార్థిని పొడియం శ్రీవల్లి (17) చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని కొత్తసూరారానికి చెందిన శ్రీవల్లి.. స్నేహితురాలు వైష్ణవితో కలిసి భద్రాచలం వెళ్లి స్కూటీపై వస్తుండగా ఈ నెల 9వ తేదీన మర్రికుంట వద్ద లారీ ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శ్రీవల్లి తీవ్రంగా గాయపడగా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. స్థానికులు చందాలు వేసుకుని, దహన సంస్కారాలు చేశారు.
అంబులెన్స్ ఢీకొని మహిళ..
ఇల్లెందు: పట్టణంలోని జగదాంబసెంటర్‌లో ఆదివారం రాత్రి 108 అంబులెన్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన మామిడిగూడెం గ్రామానికి చెందిన గుర్రం ఇంద్రజ (33) సోమవారం మృతి చెందింది. సీఈఆర్ క్లబ్‌లో జరుగుతున్న డ్యాన్స్ పోటీలు తిలకించి ఇంటికి తన భర్త రాజుతో వెళ్తున్న ఇంద్రజను అంబులెన్సు ఢీ కొట్టింది. ఇంద్రజతోపాటు రాజు కూడా గాయపడగా ఇద్దరినీ ఖమ్మం తరలించగా ఇంద్రజ మృతి చెందినది. ఆమె సోదరుడు రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అంబులెన్స్ డ్రైవర్ పి.కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లి చేసుకున్న ప్రేమ జంట
జూలూరుపాడు: కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న యువతీ, యువకుడు సోమవారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దుమ్ముగూడెంనకు చెందిన దివ్యలక్ష్మి, జూలూరుపాడుకు చెందిన నరేందర్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుని, స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల వారితో పోలీసులు మాట్లాడారు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వారు పూలదండలు మార్చుకున్నారు.
డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు
టేకులపల్లి: మండలంలోని బోడు గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలను సోమవారం సర్పంచ్ పోదెం స్వరూప, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేశారు. కేశెట్టి ఖాదర్‌బాబు, బానోత్ సురేశ్, భూక్య సైదులు, చిలువేరు చంద్రశేఖర్, సామినేని సత్యనారాయణ, రేఖ రామచంద్ర, కుంజ సాంబయ్య, మాసిపాక రామస్వామి, అన్నారపు రవి, ఈసాల రవీందర్, సూరే వీరస్వామి, బాలాజీ, మురికి సత్యనారాయణ, మురికి శంకర్, ఈర్ప వెంకటేశ్, మహమ్మద్ మున్నా, మాడే అంజమ్మ, మాసిపాక అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.


