అశ్వారావుపేటరూరల్: మండలంలోని వేదాంతపురం సమీపాన గంగారంచెరువులో శనివారం మృతుడి ఆచూకీ లభ్యమైంది. ఈ ఘటన వివరాలను ఆదివారం స్థానిక ఎస్‌ఐ టి.యయాతీ రాజు ఇలా తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ ఎడ్లబంజర్ ప్రాంతానికి చెందిన బూరుగు నాగేశ్వరరావు(65) గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేట మండలం వేదాంతపురం చుట్టు పక్కల ప్రాంతాల్లో సంచరించగా.. శనివారం గంగారం గ్రామ శివారులోని సాగునీటి చెరువులో శవమై కనిపించాడు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి ఆరా తీయగా బూరుగు నాగేశ్వరరావుగా గుర్తించినట్లు తెలిపారు. మృతుడి భార్య కొద్ది నెలల క్రితమే మృతి చెందగా, ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని సోమవారం కుటుంబీకులకు అప్పగిస్తామని ఎస్‌ఐ
తెలిపారు.
అగ్నికి ఆహుతైన పశువుల పాకలు..
దుమ్ముగూడెం: మండలంలోని సుబ్బారావుపేట గ్రామానికి చెందిన వెంకయ్య, చిన్నయ్య, చిన్నారావులకు చెందిన మూడు పశువుల పాకలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవశాత్తు అగ్గిరవ్వలు అంటుకోవడంతో మొదటగా వెంకయ్య పశువుల పాకకు మంటలు వ్యాపించి వరుసగా ఉన్నా మూడు పాకలకు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.65వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.


