మణుగూరు ఓసీ–2లో ప్రమాదం.. | - | Sakshi
Sakshi News home page

మణుగూరు ఓసీ–2లో ప్రమాదం..

Mar 30 2026 8:33 AM | Updated on Mar 30 2026 8:33 AM

● డంపర్‌ టైరు పేలి ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలు ● పరిశీలించిన జీఎం, యూనియన్‌ నేతలు

● డంపర్‌ టైరు పేలి ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలు ● పరిశీలించిన జీఎం, యూనియన్‌ నేతలు

మణుగూరు టౌన్‌: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలోని ఓసీ–2లో ఓబీ వెలికితీత పనులు నిర్వహిస్తున్న వీపీఆర్‌ (దుర్గా) కంపెనీలో సానియో డంపర్‌ టైర్‌ పేలిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను తోటి కార్మికులు, యూనియన్ల ప్రతినిధులు ఇలా తెలిపారు. ఓసీ–2లో హాల్‌ రోడ్‌ వద్ద సాయబ్‌ లాల్‌ యాదవ్‌ ఆపరేట్‌ చేస్తున్న 196 నంబర్‌ గల 60 టన్‌ శానియో డంపర్‌ ఫ్రంట్‌ వీల్‌ జామ్‌ అయి బ్రేక్‌డౌన్‌ అయింది. దాన్ని బిహార్‌కు చెందిన టైర్‌ ఫిట్టర్‌ సర్ఫరాజ్‌(40), మంతూ కుమార్‌(మెకానిక్‌), జగదీష్‌ కాశ్వా (టైర్‌ హెల్పర్‌), తాజ్‌ అన్సార్‌ (టైర్‌ సెక్షన్‌)లు సాయంత్రం 4.10 నిమిషాల సమయంలో మారుస్తుండగా టైరు ఒక్కసారిగా పేలి సమీపంలో ఉన్న సర్ఫరాజ్‌కు వేగంగా వచ్చి తగలడంతో తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సింగరేణి ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా.. సర్ఫరాజ్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రగాయాలైన సాహెబ్‌ లాల్‌ యాదవ్‌ను మెరుగైన వైద్యసేవల నిమిత్తం కొత్తగూడెం తరలించారు.

ఛిద్రమైన పక్కటెముకలు..

సంఘటనా స్థలంలో టైరుకు అతి దగ్గరగా ఉన్న సర్ఫరాజ్‌కు టైరు రింగు చాతిభాగంలో తగలడంతో 10 పక్కటెముకలు విరిగాయి. ఈక్రమంలోనే రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. ఈనేపథ్యాన బాధితులను ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ వై.రాంగోపాల్‌, రామనర్సయ్య, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు వత్సవాయి కృష్ణంరాజు, సిలివేరు గట్టయ్య, సీఐటీయూ బ్రాంచ్‌ కార్యదర్శి వెంకటరత్నం, ఇఫ్టూ నేత నాజర్‌పాషా, టీబీజీకేఎస్‌ నేత నాగెల్లి వెంకట్‌, ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌, పీఓ శ్రీ రమేశ్‌, ఇంజనీర్‌ శ్రీనివాస్‌, సెక్యూరిటీ అధికారి శ్రీని వాస్‌లు మృతుడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలో సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులతో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించాలని జీఎం వైద్య బృందాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా యూని యన్‌ నాయకులు మాట్లాడుతూ.. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఓబీ కంపెనీలో ఎస్‌ఓపీ అమలు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement