డ్రైవర్‌పై కేసు నమోదు
బూర్గంపాడు: సారపాక బస్టాండ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామచంద్రాపురం గ్రామానికి చెందిన అమృతపు మల్ల మ్మ (60) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని కదిలించడంతో ఆమె బస్సు కింద పడగా.. మల్లమ్మ కుడి కాలిపై నుంచి బస్సు టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను భద్రాచలం ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
రైస్ మిల్లులో మహిళ మృతి
వరిపొట్టు పడడంతో ఊపిరి ఆడక ఘటన
నేలకొండపల్లి: నిబంధనలు విస్మరించిన ఓ రైస్ మిల్లు యాజమాన్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అయితే, ఘటన జరిగాక కూడా యాజమాన్యం స్పందించలేదని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని రాజేశ్వరపురం వద్ద ఉన్న అరుణాచల రైస్ మిల్లులో కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన పప్పుల కళ్యాణి (34) రోజువారీ కూలీ పనులకు వస్తోంది. ఆదివారం కూడా ఆమె వరి పొట్టు తీస్తుండగా పొట్టు ఒక్కసారిగా మీద పడడంతో కూరుకుపోయింది. సహచర కూలీలు ఆమెను బయటకు తీసి సీఆర్‌పీ చేసి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదంలో యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు కళ్యాణి మృతదేహంతో నేలకొండపల్లి సెంటర్‌లో రాస్తారోకోకు దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడమే కాక మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు సీపీఎం మండల కార్యదర్శి కే.వీ.రెడ్డి, సీపీఐ నాయకుడు కర్నాటి భానుప్రసాద్ తదితరులు సంఘీభావం తెలపగా ఖమ్మం – కోదాడ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు చేరుకుని దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


