పర్యాటక రంగాభివృద్ధిలో భాగం కావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిలో సోషల్ మీడియా భాగం కావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముక్కోటి సందర్భంగా నిర్వహించనున్న ఏరు ఉత్సవం విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులతో శనివారం ఆయన సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత, గిరిజన సంస్కృతి గల ఈ జిల్లాలో పగిడేరు, గోదావరి పరీవాహక ప్రాంతాలు, కనకగిరి గుట్టలు, కిన్నెరసాని వంటి విశి ష్ట పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, ఈ ప్రాంతాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. జిల్లాకు పర్యాటకుల సంఖ్య పెరిగితే హోటళ్లు, రవాణా, హస్తకళలు, స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రివర్ ఫెస్టివల్‌లో భాగంగా 22న బెండలపాడు కనకగిరి గుట్టల ట్రెక్కింగ్, 23న ముత్తాపురం నుంచి మోతెలగూడెం బ్రిడ్జి వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల వాకింగ్, 24న పాల్వంచలోని శ్రీనివాసగిరి గుట్ట ట్రెక్కింగ్, 26న దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో ట్రైబల్ ఈవెనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
స.హ.చట్టంపై శిక్షణ..
సమాచార హక్కు చట్టంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలను కలెక్టరేట్‌లో నిర్వహించినట్లు కలెక్టర్ పాటిల్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ చట్టం అత్యంత కీలకమని, ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడమే ఈ చట్టం ఉద్దేశమని చెప్పారు. అధికారులు చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని విధి నిర్వహణలో నిబద్ధతతో అమలు చేయాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు అందజేశారు.
రహదారి భద్రతకు చర్యలు..
జిల్లాలో రహదారి భద్రతకు పలు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వెల్లడించారు. వచ్చే నెలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీసీ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి, నివారణకు అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవల కోసం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ నిర్మిస్తున్నామని చెప్పారు.
ఈఓసీని పటిష్టంగా అమలు చేయాలి
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అప్రమత్తత అవసరమని కలెక్టర్ అన్నారు. విపత్తుల నిర్వహణపై 22న మాక్‌డ్రిల్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ విద్యాచందనతో కలిసి విపత్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఈఓసీ)ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. విపత్తు పరిస్థితులను ముందుగా అంచనా వేయగలి గితే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని, ఇందుకోసం 22న బూర్గంపాడులో మాక్‌డ్రిల్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో డిప్యూటీ కలెక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, ఆర్‌టీఓ వెంకటరమణ, ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఈఈలు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ మేనేజర్ ఆనంద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కొండలరావు, మోహనకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


